కుక్కల దాడిలో జింక మృతి
జగదేవ్‌పూర్(గజ్వేల్): కుక్కల దాడిలో జింక మృతి చెందింది. ఈ ఘటన మండలంలోని తిగుల్ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... ఆదివారం ఉదయం గ్రామంలోని గణేశ్‌పల్లి రోడ్డు పక్కన పంట భూమిలో జింక ఉండగా కుక్కలు చూసి వెంటపడ్డాయి. కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన జింక మృతి చెందింది. విషయం తెలుసుకున్న బీట్ అధికారి రాజు ఘటనా స్థలానికి చేరుకొని జింకను పరిశీలించి పంచనామా చేశారు. పోస్టుమార్టం నిర్వహించి పూడ్చిపెడతామని తెలిపారు.
బోరుబావుల వద్ద
కేబుల్‌వైర్లు చోరీ
దుబ్బాక: దుబ్బాక పట్టణం శివారులోని రుషీవనం సమీపంలో 10 మంది రైతులకు చెందిన కేబుల్‌వైర్లు చోరీకి గురయ్యాయి. బోరు బావులకు చెందిన స్టార్టర్ డబ్బా నుంచి మోటర్‌ల వద్దకు వెళ్లే వైర్లను గుర్తు తెలియని వ్యక్తులు కోసుకొని ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం పోలీ సులు కేబుల్‌వైర్లు చోరీకి గురైన బోరుబావులను పరిశీలించారు. కాగా చోరీకి పాల్పడిన దొంగలను పట్టుకోవాలని బాధిత రైతులు కోరారు.
చేపల వేటకు వెళ్లి..
మంజీరాలో మునిగి
కొల్చారం(నర్సాపూర్): చేపల వేట కోసం మంజీరా నదిలోకి వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు నీట మునిగి మృత్యువాత పడిన సంఘటన మండల పరిధిలోని తుక్కాపూర్ శివారులో ఆదివారం జరిగింది. కొల్చారం పోలీసులు తెలిపిన వివరాలు.. టేక్మాల్ మండలం అచ్చన్నపల్లి గ్రామానికి చెందిన గుండు యాదగిరి (32) శనివారం రాత్రి సమీపంలోని మంజీరా నదిలో చేపల వేట కోసం ఇంటి నుంచి స్కూటీపై వెళ్లాడు. తెల్లవారిన ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు నది సమీపంలోకి వెళ్లి చూడగా తెప్ప మాత్రమే కనిపించింది. అనుమానం వచ్చి గజ ఈతగాళ్ల సాయంతో నదిలో వెతికారు. చేపల వల చుట్టుకొని నిర్జీవంగా ఉన్న యాదగిరి మృతదేహం లభించింది. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తీసుకున్న డబ్బులివ్వాలని అడిగితే.. హత్య
గజ్వేల్‌రూరల్: తన వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలన్న వ్యక్తిపై దాడికి పాల్పడి హత్య చేశారు. ఈ ఘటన మండల పరిధిలోని కోమటిబండలో ఆదివారం వెలుగుచూసింది. గజ్వేల్ పోలీసుల కథనం ప్రకారం... గజ్వేల్ పట్టణానికి చెందిన సన్నిది దుర్గయ్యకు ముగ్గురు కూతుర్లు, కొడుకు ఆంజనేయులు(30) ఉన్నాడు. కోమటిబండకు చెందిన ప్రేమకు భర్తతో పాటు ఒక కూతురు ఉన్నారు. కూలీ పనులు చేసుకునే ఆంజనేయులుకు ఆమెతో పరిచయం ఏర్పడటంతో 2020లో వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ కలిసి హైద్రాబాద్‌తో పాటు సూర్యాపేట, చేవెళ్ల ప్రాంతాల్లో జీవనం సాగించగా కొడుకు శ్రీనాథ్(2) ఉన్నాడు. ఓ చోరీ కేసులో జైలుకు వెళ్లిన ఆంజనేయులు 15రోజుల క్రితం బయటకు రావడంతో గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కోమటిబండకు వెళ్లి అత్త భారతిని కలిసి తనకు రావాల్సిన రూ. 3లక్షలు తిరిగి ఇవ్వాలని, లేనిపక్షంలో ఇంటిని తన పేరున రాసివ్వాలని గొడవకు దిగాడు. ఈ విషయం తెలుసుకున్న తండ్రి దుర్గయ్య అక్కడికి చేరుకొని అతడికి నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. తిరిగి సాయంత్రం మళ్లీ వెళ్లి వారితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో ఆంజనేయులుకు వరుసకు సోదరుడు(సడ్డకుడు) అయిన నక్కల శివ ఇనుప గడ్డపారతో తలపై కొట్టాడు. ఈ ఘటనలో అతడు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కుక్కల దాడిలో జింక మృతి


