కేబుల్ వైర్ల దొంగ పట్టివేత
కొల్చారం(నర్సాపూర్): బోరు బావుల దగ్గర నుంచి కేబుల్ వైర్లను కట్ చేసి ఎత్తుకెళ్తున్న దొంగను పట్టుకొని, పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మండలంలోని ఎనగండ్ల గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. చిలప్‌చెడ్ మండలం గౌతాపురం గ్రామానికి చెందిన నదరి భూమయ్య జల్సాలకు అలవాటుపడి వ్యవసాయ బోర్ల వద్ద కేబుల్ వైర్లను దొంగిలించి, వాటిని అమ్ముకుంటున్నాడు. ఉదయం గ్రామ శివారులోని రక్షిత మంచినీటి బోరు వద్దగల కేబుల్ వైరును దొంగిలిస్తుండగా పట్టుకున్నారు. కేబుల్ వైర్ల దొంగతనం విషయమై భూమయ్యను రైతులు విచారించగా.. చుట్టుపక్కల గ్రామాల్లో సైతం కేబుల్ వైర్లు దొంగతనం చేసినట్లు, దుంపలకుంట చౌరస్తాలో గల ఓ ఇంజనీరింగ్ దుకాణంలో వాటిని అమ్ముతున్నట్లు ఒప్పుకున్నాడు. దీంతో అతన్ని పోలీసులకు అప్పగించారు.
యువకుడి రిమాండ్
మిరుదొడ్డి(దుబ్బాక): అశ్లీల వీడియోను సోషల్ మీడియాలో ఫార్వాడ్ చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు దుబ్బాక సీఐ శ్రీనివాస్ తెలిపారు. మిరుదొడ్డి మండలం లక్షీనగర్‌కు చెందిన పుట్ట అనిల్ కొన్ని రోజుల క్రితం తన ఫోన్ ద్వారా అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నాడు. సైబర్ సెక్యూరిటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న సెల్‌ఫోన్, సిమ్‌కార్డు, డీవీడీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.


