పరిమితిలోపే ప్రజలకు వైద్యం చేయాలి
ఆర్‌ఎంపీ, పీఎంపీలకు డీఎంహెచ్‌ఓ డాక్టర్ పల్వన్‌కుమార్ హెచ్చరిక
సిద్దిపేటకమాన్: ఆర్‌ఎంపీ, పీఎంపీలు పరిమితికి లోబడి చికిత్స అందించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పల్వన్‌కుమార్ తెలిపారు. సిద్దిపేట కలెక్టరేట్ డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓలు, ప్రోగ్రామ్ ఆఫీసర్లతో ఆరోగ్య కార్యక్రమాల పనితీరు, పీసీపీఎన్‌డీటీ యాక్ట్‌పై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో నేటి నుంచి డివిజన్‌ల వారీగా ప్రైవేటు ఆస్పత్రుల పనితీరుపై అధికారులు పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. ఆస్పత్రిలో ఆరోగ్య సేవలకు సంబంధించిన ధరల పట్టికను తప్పనిసరిగా డిస్‌ప్లే చేయాలన్నారు. ఫైర్ సేఫ్టీ, బయో మెడికల్ వేస్టేజ్, వైద్యుల పేర్లు, సిబ్బంది ధ్రువపత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల నిర్వహకులు క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ ప్రకారం నిర్వహించాలని, గడువు ముగిసిన ఆస్పత్రులు రెన్యూవల్ చేసుకోవాలన్నారు. స్కానింగ్ మెషీన్ మార్పిడి, డాక్టర్ పేరు మార్పిడికి వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. రిజిస్ట్రేషన్‌లో ఉన్న వైద్యుడికి బదులు మరొక వైద్యుడు వైద్య సేవలందించే వారిపై చర్యలు తప్పవన్నారు. నిబంధనలు ఉల్లంఘించి లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.


