వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం
బుధవారం ఒక్కరోజే వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు అదృశ్యమయ్యారు. ఇందులో ఓ వ్యక్తి, వలసకూలీ, విద్యార్థి ఉన్నారు.
సోదరి ఇంటికని వెళ్లి వ్యక్తి..
జిన్నారం (పటాన్‌చెరు): వ్యక్తి అదృశ్యమైన ఘటన గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలోని కానుకుంట గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ మహేశ్వర్ రెడ్డి కథనం మేరకు.. కానుకుంట గ్రామానికి చెందిన జాంగీర్ (55) 25న తన సోదరి ముంతాజ్ చార్మినార్‌లో ఉంటుందని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. అనంతరం జాంగీర్ సోదరుడు మహమ్మద్ గౌస్ ముంతాజ్‌కు ఫోన్ చేసి జాంగిర్ వచ్చిన విషయంపై ఆరా తీయగా రాలేదని చెప్పింది. చుట్టుపక్కల బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తెల్లాపూర్‌లో వలస కూలీ
రామచంద్రాపురం(పటాన్‌చెరు): కూలీ అదృశ్యమైన ఘటన తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో బుధవారం జరిగింది. కొల్లూరు పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన బిజయ్ రబీ దాస్ జీవనోపాధి కోసం తెల్లాపూర్‌కు రెండు నెలల కిందట వలసొచ్చాడు. తెల్లాపూర్‌లోని చెరువు కట్ట సమీపంలో గుడిసెలో ఉంటూ కూలీ పనులు చేస్తున్నాడు. గత నెల 28న తోటి కూలీలు పనికి రావాలని పిలువగా రానని చెప్పాడు. సాయంత్రం తోటి కూలీలు గుడిసె వద్దకు వెళ్లి చూడగా కనిపించలేదు. దీంతో బుధవారం కొల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
హాస్టల్‌కని వెళ్లి విద్యార్థి
చేగుంట (తూప్రాన్): హాస్టల్‌కి వెళ్లి విద్యార్థి అదృశ్యమయ్యాడు. ఎస్‌ఐ చైతన్య కుమార్ రెడ్డి కథనం మేరకు.. మాసాయిపేట మండలం రామంతపురం తండాకు చెందిన అంగోత్ సుధాకర్ రామాయంపేట ఎస్టీ బాలుర వసతి గృహంలో 9వ తరగతి చదువుతున్నాడు. హాస్టల్‌లో అస్వస్థతకు గురికాగా తండాకు తీసుకొచ్చారు. జ్వరం తగ్గాక గత నెల 11న హాస్టల్‌కి వెళ్లమని చేగుంటలో తండ్రి శ్రీను రామయంపేట బస్సు ఎక్కించాడు. ఇటీవల ఉగాది పండుగ కోసం సుధాకర్‌ను ఇంటికి తీసుకురావడానికి తండ్రి హాస్టల్‌కు వెళ్లగా సుధాకర్ హాస్టల్‌కు రాలేదని వార్డెన్ తెలిపాడు. బంధువుల వద్ద వెతికినా ఆచూకీ దొరకలేదు. శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం
వేర్వేరు చోట్ల ముగ్గురు అదృశ్యం


