భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య
చేగుంట(తూప్రాన్): భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో ఓ వక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని పోతాన్‌శెట్టిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన బండారి వేణుగోపాల్(31) తన అవసరాల నిమిత్తం భార్య దీపిక పుస్తెలతాడును కుదువపెట్టి డబ్బులు తెచ్చుకున్నాడు. నెల రోజుల క్రితం దీపికతో పుస్తెలతాడు విషయంలో గొడవ జరగగా దీపిక పుట్టింటికీ వెళ్లిపోయింది. దీంతో శనివారం రాత్రి తన గదిలో వేణుగోపాల్ ఉరివేసుకున్నాడు. ఆదివారం అతడిని నిద్రలేపేందుకు తల్లి వెళ్లి తలుపు తట్టగా తెరవలేదు. దీంతో స్థానికుల సాయంతో గదితలుపులు తెరవగా ఉరివేసుకొని మృతి చెంది ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి సుగుణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి తెలిపారు.


