త్వరలో తహసీల్దార్ల బదిలీలు!
● నెలాఖరులోపు ఉత్తర్వులు! ● నెల క్రితమే ఆప్షన్లు తీసుకున్న రెవెన్యూశాఖ ● కీలక మండలాల్లో పోస్టుల కోసం ఉవ్విళ్లు!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికల బదిలీల్లో భాగంగా వివిధ జిల్లాలకు బదిలీపై వెళ్లిన తహసీల్దార్లు తిరిగి జిల్లాకు రానున్నారు. రెవెన్యూ శాఖ వర్గాల్లో దీనిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఏడాదిన్నర క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలో పనిచేసిన తహసీల్దార్లు రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌గిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్ వంటి జిల్లాలకు తహసీల్దార్లు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఇక్కడి నుంచి సుమారు ఏడాదిన్నర కాలంగా వీరంతా ఆయా జిల్లాల్లోనే పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది సొంత జిల్లాకు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో బదిలీలు కోరుకునే తహసీల్దార్ల నుంచి ఆప్షన్లు కూడా తీసుకున్నారు. ఈ తహసీల్దార్ల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ నెలాఖరులోపు ఉత్తర్వులు వచ్చే అవకాశాలున్నాయని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలోనూ ఇలాగే త్వరలోనూ ఉత్తర్వులు వెలువడుతాయని పలుమార్లు చర్చ జరిగినా బదిలీ ఉత్తర్వులు మాత్రం రాలేదు.
స్థానిక సంస్థల ఎన్నికలయ్యే వరకు..
స్థానిక సంస్థల ఎన్నికలయ్యే వరకు తహసీల్దార్లను సొంత జిల్లాలకు పంపే అవకాశాలు లేవని గతంలో చర్చ జరిగింది. చాలామంది తహసీల్దార్లు గత ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. వీరంతా తిరిగి జిల్లాకు చేరుకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవనే భావనతో ప్రభుత్వ పెద్దల్లో ఉన్నట్లు చర్చ జరిగింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు మరికొన్ని నెలలు పట్టే అవకాశం ఉండటంతో ఇప్పుడు తహసీల్దార్ల బదిలీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆశాఖ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఆ పోస్టులకు భలే డిమాండ్..
జిల్లాలో కొన్ని మండలాల తహసీల్దార్ల పోస్టులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ప్రధానంగా పటాన్‌చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల పరిధిలోని తహసీల్దార్ పోస్టుల కోసం కొందరు ఉవ్విళ్లురుతున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో ఆయా మండలాల్లో పనిచేసిన కొందరు పెద్ద ఎత్తున అక్రమార్జనకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ధరణిని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం భూములను నేతలు, బడా బాబులకు కట్టబెట్టడం వెనుక రూ.కోట్లు, అలాగే వారసులు లేని భూములను వందల ఎకరాల్లో పట్టాలు చేసి అందినకాడికి దండుకున్నారనే ఆరోపణలు వినిపించాయి. ఇలా అక్రమార్జనకు వీలున్న మండలాల్లో తిరిగి పోస్టింగ్ దక్కించుకునేందుకు కొందరు తహసీల్దార్లు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నేతలతో సన్నిహిత సంబంధాలు నెరపిన కొందరు తహసీల్దార్లు ఇప్పుడు కూడా అధికార పార్టీ ప్రజాప్రతినిధులను మచ్చిక చేసుకుని ఈ కీలక పోస్టులను దక్కించుకునేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నట్లు రెవెన్యూశాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో కీలక మండలాల్లో పనిచేసిన తహసీల్దార్లకు అవే మండలాల్లో పోస్టింగ్‌లు దక్కుతాయా? లేక వీరిని మారుమూల మండలాలకు పోస్టింగ్ ఇస్తారా అనేదానిపై స్పష్టత రావాలంటే ఉత్తర్వులు వెలువడే వరకు వేచి చూడాల్సిందే.


