నేరుగా గన్నీబ్యాగుల్లోనే...
నారాయణఖేడ్: పేదలకు పంపిణీ కావాల్సిన బియ్యం యథేచ్ఛగా పక్కదారి పడుతున్నాయి. తరచూ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యం పోలీసులకు పట్టుబడుతుండటమే ఇందుకు నిదర్శనం. ఈ పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలించినా, కొనుగోలు, అమ్మకాలు చేపట్టినా కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తోన్నా ఈ ‘రైస్ ముఠా’కు చీమకుట్టినట్లు కూడా లేదు. పైగా వీరి అక్రమ దందా అధికారుల అండదండలతోనే నడుస్తోందనే ఆరోపణలు వినవస్తున్నాయి. మూడు రోజుల క్రితం కల్హేర్ మండలం మాసాన్‌పల్లి సమీపంలో పట్టుబడ్డ లారీలకు సంబంధించి కేవలం ముందురోజు రెండిటిపైనే, ఆ మరుసటి రోజు మూడో లారీపైనా కేసులు నమోదైన వ్యవహారాలే ఈ ఆరోపణలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇక పట్టుబడ్డ లారీలతో అధికారులు కొందరు సెటిల్‌మెంట్ వ్యవహారం నడిపి అది కుదరకపోవడంతోనే కేసులు నమోదు చేశారనే ఆరోపణలున్నాయి. కాగా పట్టుబడ్డ ఒక్కో లారీలో 30టన్నుల చొప్పున మూడు లారీల్లో 90 టన్నుల బియ్యం ఉండాలి. కానీ అధికారులు బియ్యం సంఖ్య తక్కువ చూపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అప్పుడ కూడా ఇదే ధోరణి!
సంగారెడ్డి– నాందేడ్– అకోలా 161 జాతీయ రహదారి నిజాంపేట్ మీదుగా ఉంది. ఈ రహదారిపై హైదరాబాద్ నుంచి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతుందన్న ఆరోపణలున్నాయి. నాలుగు నెలల క్రితం నిజాంపేట్ ఫ్లై ఓవర్ వద్ద అధికారులు రెండు లారీలను పట్టుకున్నారు. ఈ లారీలపై కూడా మొదట నాన్చుడు ధోరణి అవలంభించిన పోలీసులు ఆ తర్వాత కేసులు నమోదు చేశారనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. పట్టుబడిన బియ్యం లారీల విషయంలో రెవెన్యూ శాఖకు చెందిన ఓ ఉద్యోగి పీడీఎస్ బియ్యం సరఫరాకు సంబంధించి పూర్తి అవగాహన ఉండటంతో అతడే సెటిల్‌మెంట్ వ్యవహారాలు నడిపిస్తాడని, సెటిల్‌మెంట్ కాని పక్షంలోనే కేసుల నమోదు అవుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
రైస్ మిల్లులకు సరఫరా... ఐతే!
పట్టుబడ్డ బియ్యం కూడా రైసుమిల్లులకే సరఫరా అవుతుంటాయి. కానీ రైస్‌మిల్లులో కాకుండా రహదారిపై పట్టుబడటంతోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పట్టుబడ్డ మహారాష్ట్రకు వెళ్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. రైస్‌మిల్లులకు ప్రభుత్వం సరఫరా చేసిన వరి ధాన్యం, మర ఆడించిన బియ్యం, ఎఫ్‌సీఐకి పంపిన బియ్యం వివరాలు ఏమేరకు ఉన్నాయన్న లెక్కలను సరిచూసిన పక్షంలో అక్రమాలు వెలుగుచూసే అవకాశాలున్నాయి. సరఫరా అయిన వరి ధాన్యం కర్ణాటక, మహారాష్ట్రలకు సరిహద్దులు దాటించి పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి ప్రభుత్వానికి లెవీకింద పంపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. బీదర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్ ప్రాంతం నుంచి బియ్యంను లారీల్లో నింపి ఢిల్లీ పాసింగ్‌తో తన జీప్‌లో ముందు రూట్ క్లియర్ చేస్తూ రైస్‌మిల్లులకు సరఫరా చేస్తారనే ఆరోపణలున్నాయి.
హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర, కర్ణాటకకు అక్రమ రవాణ
టన్నుల కొద్దీ లారీల్లో సరఫరా
‘రైస్ ముఠా’కు అధికారుల అండ!
పట్టుబడితే సెటిల్‌మెంట్.. కాని పక్షంలోనే కేసులు నమోదు
బియ్యం రవాణా జరిగే సందర్భాల్లో అక్రమార్కులు కొనుగోలు చేసిన పేదల బియ్యంను తెల్లటి బస్తాల్లో నింపి సరఫరా చేస్తారు. మాసాన్‌పల్లి వద్ద పట్టుబడ్డ బియ్యం బస్తాలు నేరుగా పీడీఎస్ గన్నీ బస్తాల్లోనే సరఫరా చేశారు. గోడౌన్ల నుంచి సరఫరా చేసిన గన్నీ బస్తాలపై ఏ గోడౌన్ నుంచి ఏ ప్రాంతానికి బియ్యం సరఫరా చేశారనే వివరాలు ఉంటాయి. ఈ లెక్కన పేదల బియ్యం లబ్ధిదారుల వద్ద కాకుండా రేషన్ డీలర్ల వద్ద కొనుగోలు చేశారా లేక గోడౌన్‌లోనే కొనుగోలు చేసి తెచ్చారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పేదల బియ్యం పక్కదారి!