ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లోకి బాలుడు | - | Sakshi
Sakshi News home page

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లోకి బాలుడు

Mar 19 2025 8:03 AM | Updated on Mar 19 2025 8:01 AM

కౌడిపల్లి(నర్సాపూర్‌): ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో మూడున్నరేళ్ల ధ్రువకరణ్‌ రెడ్డి చోటు సంపాదించాడు. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌కు చెందిన ఉపాధ్యాయుడు తోట కరుణాకర్‌ రెడ్డి ప్రస్తుతం కౌడిపల్లి నివాసం ఉంటూ మండలం పీర్యతండా ప్రాథమిక పాఠశాలలో ఐదేళ్లుగా విధులు నిర్వహిస్తున్నాడు. కరుణాకర్‌రెడ్డి, ప్రియాంక దంపతులకు కుమారుడు ధ్రువకరణ్‌ రెడ్డి(మూడున్నరేళ్లు), కూతురు ప్రవస్థ (2) ఉన్నారు. ధ్రువకరణ్‌ రెడ్డికి తల్లిదండ్రులు దేశంలోని వివిధ రాష్ట్రాలు, వాటి రాజధానులు, వివిధ దేశాల జాతీయ జెండాలు, నాయకుల పేర్లు, ఫ్లాష్‌ కార్డులు గుర్తింపులో ప్రత్యేక శిక్షణ ఇవ్వగా బొమ్మలు చూపగానే టక్కున గుర్తిస్తున్నాడు. గత నెలలో ధ్రువకరణ్‌ రెడ్డి దేశంలోని 28 రాష్ట్రాలు, వాటి రాజధానులను 46.58 సెకన్లలో గుర్తించగా వీడియో రికార్డు చేసి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుకు పంపించారు. పరిశీలించిన ప్రతినిధులు అతడి వయసు, సమయం ఆధారంగా ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు కల్పించి సర్టిఫికెట్‌ పంపిణీ చేశారు. మెడల్‌, సర్టిఫికెట్‌ మంగళవారం అందించడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

అనుమానాస్పద స్థితిలో నెమలి మృతి

తొగుట(దుబ్బాక): అనుమానాస్పద స్థితిలో నెమలి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. ఫారెస్ట్‌ బీటాఫీసర్‌ నరేశ్‌ కథనం మేరకు.. తొగుట పెట్రోల్‌ పంపు సమీపంలో నెమలి మృతి చెంది ఉందని గ్రామస్తుల ద్వారా సమాచారం అందింది. ఘటనా స్థలానికి వెళ్లి నెమలిని పరిశీలించగా మరణించింది. స్థానిక పశు వైద్యాలయానికి తీసుకెళ్లగా పశువైద్యాధికారి రమేశ్‌ పోస్టుమార్టం నిర్వహించారు. తదుపరి నిర్ధారణ, ఆధారాల కోసం ఎఫ్‌వైఎస్‌ఎల్‌కు పంపించామని అధికారి తెలిపారు.

మహిళ ఆత్మహత్యాయత్నం

నిజాంపేట(మెదక్‌): చెరువులో దూకి మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నిజాంపేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నిజాంపేట మండలానికి చెందిన దండు చంద్రవ్వ కుమారుడు పదేళ్ల కిందట చనిపోయాడు. అప్పటి నుంచి మతిస్థిమితం కోల్పోయి గ్రామంలో తిరుగుతుంది. మంగళవారం మధ్యాహ్నం నిజాంపేటకు చెందిన ఘడీం చెరువులో ఆత్మహత్యాయత్నం చేసింది. అటుగా వెళ్తున్న కుమార్‌ అనే వ్యక్తి గమనించి ఆమెను పైకి తీసుకొచ్చారు. వెంటనే 108కి సమాచారం అందించి రామాయంపేట ప్రభుత్వాస్పత్రికి చికిత్స కోసం తరలించారు.

రంగనాయక సాగర్‌ వద్ద అగ్ని ప్రమాదం

చిన్నకోడూరు(సిద్దిపేట): మండల పరిధిలోని చంద్లాపూర్‌ శివారులోని రంగనాయక సాగర్‌ రిజర్వాయర్‌ వద్ద గల ఇరిగేషన్‌ ఎస్‌ఈ కార్యాలయం సమీపంలో మంగళవారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రెండుగంట పాటు శ్రమించి మంటలార్పారు.

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లోకి బాలుడు 
1
1/2

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లోకి బాలుడు

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లోకి బాలుడు 
2
2/2

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లోకి బాలుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement