
బీమా కుటుంబానికి ధీమా
మెదక్ కలెక్టరేట్: ప్రస్తుత సమాజంలో ప్రతి ఇంట్లో కనీసం ఒక ద్విచక్ర వాహనం, కార్లు ఉన్నాయి. ఏ చిన్న అవసరం పడినా బైక్ పైనే పరుగులు పెడుతున్నారు. డ్రైవింగ్‌పై అవగాహన లేకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఘటనల్లో ప్రాణాలు పోవడమే అత్యధికంగా జరుగుతోంది. అప్పుడప్పుడు మాత్రం అంగవైకల్యంతో బయట పడుతున్నారు. అత్యధికంగా మద్యం సేవించి వాహనాలు నడపడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే విద్యుత్ మోటర్ల వద్ద పొలానికి నీళ్లు పారిస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురై ఎంతో మంది రైతులు మృత్యువాత పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. జిల్లాలో 2023లో 562 రోడ్డు ప్రమాద ఘటనల్లో 223 మంది మృత్యువాత పడ్డారు. అలాగే 2024లో 568 రోడ్డు ప్రమాదాల్లో 302 మంది చనిపోగా, మరో 459 మంది గాయాలపాలయ్యారు. అకాల మరణాలతో వారిపై ఆధారపడిన కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయి. ఆదుకునే వారు లేక, ఆర్థికంగా ఎదగలేక ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నిరుపేదలకు అతి తక్కువ ప్రీమియంతో పెద్ద మొత్తంలో బీమా అందిస్తోంది.
ఏడు ప్రైవేట్ కంపెనీలతో...
కేంద్ర ప్రభుత్వం పలు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలతో కలిసి అతి తక్కువ మొత్తానికే తపాలా ప్రమాద బీమా అందిస్తోంది. ఆపద సమయంలో అభాగ్యులకు అండగా ఉండేందుకు తీసుకొచ్చిన ఈ పాలసీతో ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఇందులో టాటా ఏఐజీ, బజాజ్ జనరల్ ఇన్సూరెన్స్, స్టార్ హెల్త్, నివోభూపా, రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్, రాయల్ సుందరం, ఆదిత్య బిర్లా కంపెనీలు పనిచేస్తున్నాయి.
రూ.549లతో రూ.10 లక్షలు, రూ.749తో రూ.15 లక్షలు
పాలసీదారులు కేవలం రూ.549 లేదా 555లు చెల్లిస్తే రూ.10లక్షల బీమా లభిస్తుంది. అలాగే రూ.749 లేదా 755లతో రూ.15లక్షల బీమా అందిస్తున్నారు. ఒక్కొక్కరు రెండు, మూడు పాలసీలు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రమాదవశాత్తు పాలసీదారు మరణించడం లేదా శాశ్వత అంగవైకల్యం, పక్షవాతం బారిన పడినప్పుడు అతడి కుటుంబానికి బీమా డబ్బులు అందజేస్తారు. అయితే పాలసీదారులు రూ.18 నుంచి 66 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
3 లేదా 4నెలల్లో క్లయిమ్..
పాలసీదారు ప్రమాదవశాత్తు మరణిస్తే మూడు లేదా నాలుగు నెలల్లోనే క్లయిమ్ డబ్బులు ఖాతాలో జమ అవుతాయి. దీంతో ఆ కుటుంబానికి ఆర్థికంగా కొండంత అండ లభిస్తోంది. అలాగే బీమా చేసిన వ్యక్తికి చదువుకునే పిల్లలిద్దరు ఉంటే వారి చదువు ఖర్చులు పదిశాతం లేదా రూ.ఒక లక్ష ఇలా ఏది తక్కువైతే అది చెల్లిస్తారు.
విదేశాల్లో ఉన్నా...
పాలసీదారుడు విదేశాల్లో మరణిస్తే స్వదేశం తేవడానికి రూ.5వేలు, అంత్యక్రియలకు రూ.5వేలు అందజేస్తారు. చనిపోయిన వ్యక్తి కుటుంబీకులు దూర ప్రాంతాల్లో ఉంటే అంత్యక్రియలకు రూ.25వేలు ఇస్తారు. ప్రమాదంలో పాలసీదారుడు తీవ్రంగా గాయపడితే చికిత్స కోసం రూ.లక్ష, కోమాలోకి వెళితే రూ.లక్ష, ప్రమాదం జరిగిన వ్యక్తి రెండు రోజులకు మించి ఆస్పత్రిలో ఉంటే పదిరోజుల వరకు రోజుకు రూ.1000ల చొప్పున చెల్లిస్తారు.
జిల్లాలో రూ.1.40 కోట్లు
ఆపదలో అండగా కేంద్ర ప్రభుత్వ తపాలా బీమా
అవగాహన లేక తీసుకోలేక పోతున్న ప్రజలు జిల్లాలో 10, 200 మంది పాలసీదారులు
ప్రజలకు అందుబాటులో తక్కువ ప్రీమియంలు
జిల్లాలో మొత్తం 10,200 మంది పాలసీదారులు ఉన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన పాలసీదారుల కుటుంబాలకు ఇప్పటి వరకు రూ.1.40కోట్ల బీమా డబ్బులు అందజేశాం. సబ్ పోస్ట్ మాస్టర్లు, పోస్ట్ మాస్టర్ల ద్వారా తపాలా బీమాపై ప్రజలకు సమాచారం అందిస్తున్నాం. జిల్లాలోని ప్రజలందరూ ఇన్సూరెన్స్ చేసుకోవాలి. ఆపద సమయంలో కుటుంబాలను ఆదుకుంటాయి.
–శ్రీనివాస్,
పోస్టల్ ఇన్సూరెన్స్ అధికారి, మెదక్