
మాట్లాడుతున్న జనరల్ అబ్జర్వర్ పవన్ కుమార్
సంగారెడ్డి టౌన్: ఓటర్లు స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని జనరల్ అబ్జర్వర్లు పవన్ కుమార్, దీపక్ సింగ్లా అన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణ పరిశీలనకు జహీరాబాద్, సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాలకు జనరల్ అబ్జర్వర్‌గా కలెక్టర్ పవన్ కుమార్, నారాయణఖేడ్, అందోల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు జనరల్ అబ్జర్వర్‌గా కలెక్టర్ దీపక్ సింగ్లాను ఎన్నికల కమిషన్ నియమించింది. గురువారం వారు జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీ, నోడల్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు తమ విధులు నిర్వర్తించాలన్నారు. గత ఎన్నికల్లో పోలింగ్ శాతం బాగుందన్నారు. ఎన్నికల నిర్వహణకు జిల్లాలో చేపట్టిన ఏర్పాట్లు, పోలింగ్ శాతం పెరుగుదలకు తీసుకుంటున్న చర్యలు, ఎన్నికల విధులకు కేటాయించిన వివిధ బృందాలు, ఏర్పాటు చేసిన నోడల్ అధికారులు, చేస్తున్న పనులు తదితర అంశాలపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బాగుందని కితాబిచ్చారు. అంతకు ముందు కలెక్టర్ డాక్టర్ శరత్ ఎన్నికల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను వారికి వివరించారు. జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) సెంటర్‌ను, సోషల్ మీడియా సెల్, ఎంసీసీ, ఈఈఎం సీ, సీవిజిల్, జిల్లా గ్రీవెన్స్ సెల్‌ను ఎన్నికల జనరల్ అబ్జర్వర్లు పరిశీలించారు. సమావేశంలో ఎస్పీ రూపేష్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, అదనపు ఎస్పీ అశోక్, తదితరులు పాల్గొన్నారు.
జనరల్ అబ్జర్వర్లు పవన్ కుమార్, దీపక్ సింగ్లా