Nambi Narayanan Story: నంబి నారాయణన్‌.. పడిలేచిన కెరటం!

Nambi Narayanan: Hidden Truths in The ISRO Spy Case - Sakshi

అవమానం ఎదురైన చోటే అందలం ఎక్కితే ఆ కిక్కే వేరు. పరువు పోయినచోటే మళ్లీ గౌరవం దక్కడం అంటే మాటలా? న్యాయం కోసం రెండు దశాబ్దాలకు పైగా పోరాటం చేసిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్‌(80) అలాంటి గౌరవాన్నే పొందారు. నకిలీ కేసుపై రాజీలేని పోరాటం చేసి గెలిచిన ఆయన తాజాగా మరో ఘనత సాధించారు. 2022 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం 15 మంది సభ్యులతో ఏర్పాటు చేసిన పద్మ పురస్కారాల ఎంపిక కమిటీలో నారాయణన్‌ కూడా ఉన్నారు. తాజాగా ఈ కమిటీ 128 మందిని పద్మపురస్కారాలకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. 

1990 దశకంలో ‘గూఢచారి’గా నిందించబడి, జైలుపాలై... 2019లో దేశ మూడో అ‍త్యున్నత పురస్కారం పద్మభూషణ్‌ అందుకునే వరకు నంబి నారాయణన్‌ సాగించిన పోరాటం అనన్య సామాన్యం. సత్యం కోసం చివరి వరకు నిలబడి పద్మ పురస్కారం అందుకోవడమే కాదు.. ఇప్పుడు సెలక్షన్‌ కమిటీలోనూ ఆయన చోటు దక్కించుకోవడం విశేషం. తనను నిరపరాధిగా నిరూపించుకోవడం, నష్టపరిహారం దక్కించుకోవడంతోనే ఆయన పోరాటం ముగించలేదు. దేశం ముందు తనను అపరాధిగా నిలబెట్టిన కుట్రదారులెవరో కనిపెట్టాలన్న ఆయన పంతం ఇంకా నెగ్గలేదు. నారాయణన్‌ను ‘గూఢచారి’ కేసులో ఇరికించిన సూత్రధారులను చట్టం ముందు నిలబెట్టాలని 2021, ఏప్రిల్‌లో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలివ్వడం ఈ పోరాటంలో మేలిమలుపు.

అసలేం జరిగింది?
1994, అక్టోబర్‌లో మాల్దీవుల మహిళ మరియం రషీదా అరెస్ట్‌తో కథ మొదలైంది. ఇస్రో క్రయోజెనిక్‌ ఇంజన్‌ డ్రాయింగ్స్‌ను పాకిస్థాన్‌కు అమ్ముతుందంటూ ఆమెపై కేరళ పోలీసులు అభియోగాలు మోపారు. క్రయోజెనిక్‌ ఇంజన్‌ డిజైన్‌ ప్రాజెక్ట్‌కు డైరెక్టర్‌గా ఉన్న నంబి నారాయణన్‌తో పాటు ఆయన డిప్యూటీ డి. శశికుమారన్‌, రష్యా అంతరిక్ష సంస్థకు చెందిన భారత ప్రతినిధి కె. చంద్రశేఖర్, ఎస్.కె. లేబర్ కాంట్రాక్టర్ శర్మ, రషీదా స్నేహితుడు ఫౌసియా హసన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై గూఢచర్యం కింద కేసులు నమోదు చేశారు. మాల్దీవుల జాతీయులు మినహా ఇస్రో శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు బెయిల్‌పై 1995 జనవరిలో విడుదలయ్యారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. 1996 ఏప్రిల్‌లో కేరళ కోర్టుకు నివేదిక సమర్పించింది. నిందితులు ఎటువంటి గూఢచర్యానికి పాల్పడలేదని క్లీన్‌చిట్‌ ఇచ్చింది. సీబీఐ సమర్పించిన కేసు మూసివేత నివేదికను అంగీకరించిన కోర్టు నిందితులందరినీ నిర్దోషులుగా విడుదల చేసింది.

కీలక మలుపులు
రాష్ట్ర పోలీసులతో కేసును మరోసారి దర్యాప్తు చేయించాలని 1996, జూన్‌లో కేరళ ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది. కాగా, కేసులో నిరపరాధులుగా తేలిన నిందితులకు 1998 మే నెలలో సుప్రీంకోర్టు రూ. 1 లక్ష పరిహారం ప్రకటించింది. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నిందితులు అనుభవించిన మానసిక క్షోభకు నష్టపరిహారం చెల్లించాలని కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు తనను నకిలీ కేసులో ఇరికించిన వారిని గుర్తించాలని నారాయణన్‌ వేసిన పిటిషన్‌పై 2017 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. దుర్మార్గపు ప్రాసిక్యూషన్ కారణంగా నారాయణన్‌ ప్రతిష్టకు భంగం కలిగిందని, దీనికి కేరళ ప్రభుత్వం బాధ్యత వహించాలని 2018 మే 9న అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అబద్దపు కేసుతో నారాయణన్‌ను మానసికంగా వేధింపులకు గురిచేసినందుకు ఆయనకు రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని 2018 సెప్టెంబర్‌ 14న కేరళ ప్రభుత్వాన్ని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కాగా, కోర్టు ఆదేశించిన పరిహారానికి అదనంగా రూ.1.3 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని 2019లో కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. (క్లిక్‌: తెలంగాణలో ‘ఆప్’సోపాలు.. ఢిల్లీ మోడల్ వర్కవుట్ అవుతుందా?)

కొనసాగిన పోరాటం
నష్ట పరిహారం దక్కినా నారాయణన్‌ న్యాయ పోరాటం ఆపలేదు. తనను అపఖ్యాతి పాల్జేసిన వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని కేరళ హైకోర్టు తలుపు తట్టారు. దీన్ని ముగిసిన అధ్యాయంగా భావించాలని, ఈ వ్యవహారాన్ని ఇంతటితో ముగించాలని ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన సలహాతో సంతృప్తిచెందకుండా సుప్రీంకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జైన్, మరో ఇద్దరు అధికారులతో కమిటీని ఏర్పాటుచేసింది. కమిటీ నివేదిక ఆధారంగా 2021 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు.. సీబీఐకి ఆదేశాలిచ్చింది. నారాయణన్‌ను గూఢచార్యం కేసులో ఇరికించిన వారిని తమ ముందు నిలబెట్టాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో 18 మంది కేరళ పోలీసులపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. (క్లిక్‌: నవాబ్‌ మాలిక్‌కు బిగుసుకుంటున్న ఉచ్చు)

అమెరికా హస్తం?
తమపై మోపిన గూఢచార్యం కేసు వెనుక ప్రపంచ పెద్దన్న అమెరికా హస్తం ఉందన్న అనుమానాన్ని కేరళ హైకోర్టు ఎదుట నారాయణన్‌ వెలిబుచ్చారు. క్రయోజెనిక్ ఇంజన్‌ను భారత్ అభివృద్ధి చేయడాన్ని అడ్డుకోవాలనే లక్ష్యంతో అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ ఈ పనికి పాల్పడిందని ఆయన పేర్కొన్నారు. భూ స్థిర కక్ష్యలోకి భారీ ఉపగ్రహాలను పంపించేందుకు ఉపయోగించే క్రయోజెనిక్‌ పరిజ్ఞానాన్ని మన దేశానికి ఇవ్వడానికి పూర్వపు సోవియట్‌ యూనియన్‌ అంగీకరించినా అమెరికా ఒత్తిడి తీసుకొచ్చి ఆపించింది. తన నేతృత్వంలో దేశీయంగా క్రయోజెనిక్‌ ఇంజన్‌ తయారు చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రాజెక్టును గూఢచర్యం కేసుతో అమెరికా విచ్ఛిన్నం చేసిందన్నది నారాయణన్‌ వాదన. క్రయోజెనిక్‌ పరిజ్ఞానాన్ని భారత్‌ అభివృద్ధి చేసి ఉంటే, చాలా దేశాలు తమ ఉపగ్రహాలను ప్రయోగించడానికి మన దేశాన్ని సంప్రదించేవని పేర్కొన్నారు. ఎందుకంటే భారత్‌తో పోలిస్తే యూఎస్‌లో ఉపగ్రహాలను ప్రయోగించడానికి భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. మనం తక్కువ ఖర్చుతో  క్రయోజెనిక్‌ ఇంజన్‌ చేస్తే తమ ఆధిపత్యానికి గండి పడుతుందన్న భయంతో అమెరికా ఇదంతా చేసిందన్న భావనను నారాయణన్‌ వ్యక్తపరిచారు. కాగా, 2014 జనవరిలో తొలి దేశీయ క్రయోజెనిక్‌ ఇంజన్‌ను భారత శాస్త్రవేత్తలు తక్కువ ఖర్చుతో తయారు చేయగలిగారు. 

పుస్తకాలు.. సినిమా
అర్జున్‌ రామ్‌తో కలిసి ‘రెడీ టు ఫైర్‌:  హౌ ఇండియా సర్‌వైవడ్‌ ది ఇస్రో స్పై కేస్‌’ పేరుతో నంబి నారాయణన్‌ పుస్తకం తెచ్చారు. గూఢచార్యం కేసు, తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల ఆధారంగా ‘క్లాసిఫైడ్‌: హిడెన్‌ ట్రూట్స్‌ ఇన్‌ ది ఇస్రో స్పై స్టోరీ’పేరుతో ప్రముఖ జర్నలిస్ట్‌ రాజశేఖర్‌ నాయర్ పుస్తకం రాశారు. ఇదే నేపథ్యంలో ఇంటెలిజెన్స్‌ బ్యూరో మాజీ అధికారి కేవీ థామస్‌ కూడా ‘ఇస్రో మిస్‌ఫైరెడ్‌: ది ఇప్సినేజ్‌ కేస్‌ దట్‌ షుక్‌ ఇండియా’ పేరుతో పుస్తకం రూపొందించారు. నంబి నారాయణన్‌ జీవితం ఆధారంగా ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్‌’ పేరుతో ఇంగ్లీషు, హిందీ, తమిళ భాషల్లో సినిమా తెరకెక్కింది. నటుడు మాధవన్‌.. నంబి నారాయణన్‌ పాత్రలో నటించి, నిర్మించడమే కాకుండా దర్శకత్వం వహించారు. ప్రముఖ హీరోలు సూర్య, షారూఖ్‌ ఖాన్‌ కూడా ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా 2022 ఏప్రిల్‌ 1న విడుదల కానుంది. తెలుగు, కన్నడ, మలయాళంలోకి అనువదించి విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. ఎన్నో మలుపులు తిరిగిన నంబి నారాయణన్‌ జీవితం వెండితెరపై ఎలాంటి సంచనాలు సృష్టిస్తుందో వేచిచూడాలి. (క్లిక్‌: మంత్రి అరెస్ట్‌పై రాజకీయ దుమారం.. ఎవరీ నవాబ్‌ మాలిక్‌?)

- సాక్షి, వెబ్‌ స్పెషల్‌

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top