Bruce Lee Death Reason: ఓవర్‌గా వాటర్‌ తాగితే.. బ్రూస్‌లీలా మరణం ఖాయమంటున్న పరిశోధకులు!

Bruce Lee may have died from This Reason - Sakshi

మార్షల్‌ ఆర్ట్స్‌.. ఈ పేరు వినగానే కళ్ల ముందర మెదిలే రూపం బ్రూస్‌ లీ. తరాలు మారుతున్న మార్షల్‌ ఆర్ట్స్‌పై ఆసక్తికనబరిచే యువతకు ఆయనే ఆదర్శం. ఒకవైపు డిష్యుం.. డిష్యుంలతో పాటు నటుడిగానూ అశేష అభిమానులను సంపాదించుకున్నారాయన. అయితే.. కేవలం 32 ఏళ్ల వయసులోనే చనిపోయి.. అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టేసి వెళ్లిపోయారు.  ఆ టైంలో ఆయన మరణంపై రకరకాల ఊహాగానాలు తెర మీదకు వచ్చాయి. కానీ, మెదడు వాపు కారణంగానే ఆయన చనిపోయారని వైద్యులు ఆ టైంలో ప్రకటించారు. అయితే.. ఇప్పుడు సుమారు యాభై ఏళ్ల తర్వాత ఆయన మరణానికి కారణం చర్చలోకి వచ్చింది.  

మార్షల్‌ ఆర్టిస్ట్‌ బ్రూస్‌లీ మరణంపై తాజాగా మరో ప్రకటనపై చేశారు పరిశోధకులు. అదీ ఓ అధ్యయనం నిర్వహించి మరీ!. 1973 జులైలో సెరెబ్రల్‌ ఎడిమా అనే వ్యాధితో బ్రూస్‌లీ మరణించినట్లు ఆయన్ని పరిశీలించిన వైద్యులు ప్రకటించారు. సెరెబ్రల్‌ ఎడిమా అంటే మెదడు వాపు. పెయిన్‌కిల్లర్స్‌ అతిగా వినియోగించడం వల్ల మెదడు కణాలు వాపు ఎక్కినట్లు వైద్యులు భావించారు. కానీ.. 

బ్రూస్‌లీ మరణం వెనుక.. మంచి నీళ్లు ఉన్నాయన్నది ఇప్పుడు స్పెయిన్‌ సైంటిస్టులు చెప్తున్న మాట. అవును.. అతిగా నీళ్లు తాగడం వల్లే బ్రూస్‌లీ మరణించారని స్పెయిన్‌ శాస్త్రవేత్తలు ఓ అధ్యయనం నిర్వహించి మరీ ప్రకటించారు. హైపోనాట్రేమియా.. అతిగా నీరు తాగడం వల్ల శరీరంలో అవసరానికి మించిన సోడియం స్థాయిలు కరిగిపోతాయి. ఈ స్థితి వల్లే బ్రూస్‌లీ సెరెబ్రల్‌ ఎడిమా బారిన పడినట్లు స్పెయిన్‌ శాస్త్రవేత్తలు తాజా అధ్యయనం ద్వారా వెల్లడించారు. నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల సోడియం లెవల్స్‌ తగ్గిపోయి.. శరీరంలోని కణాలు, ముఖ్యంగా మెదడులో కణాలు వాపు చెందుతాయి. అదే బ్రూస్‌లీ మరణానికి దారితీసి ఉంటుందని ఇప్పుడు స్పెయిన్‌ సైంటిస్టులు చెప్తున్నారు.

ద్రవ పదార్థాలు అధికంగా తీసుకోవడం, గంజాయి లాంటి మాదకద్రవ్యాల వల్ల అతిగా దాహం వేయడం, ఆల్కహాల్ అలవాట్లతో అధిక నీటిని బయటకు పంపించే సామర్థ్యాన్ని కిడ్నీలు కోల్పోవడం వంటివి ఈ పరిస్థితికి దారితీస్తాయని స్పెయిన్‌ సైంటిస్టుల అధ్యయనం వెల్లడించింది.

నీరు ఎక్కువగా తాగడం ముప్పే!

బీ వాటర్‌ మై ఫ్రెండ్‌.. బ్రూస్‌ లీ తరపున విపరీతంగా వైరల్‌ అయ్యే కోట్‌ ఇది. పలు పుస్తకాల్లోనూ ఈ ప్రస్తావన ఉంటుంది. రోజూవారీ జీవితంలో ఆయన మంచి నీటికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు వాటిని చదివితే తెలుస్తుంది. అంతేకాదు.. ఓ మనిషి మంచి నీటిలా బతకాలంటూ ఆయన పేరు మీద ఓ ఫిలాసఫీ కూడా ప్రచారంలో ఉంది. కానీ, అంతలా నమ్మిన మంచి నీరే ఆయన ప్రాణం తీయడం ఇక్కడ విశేషం. అయితే అందుకు ‘అతి’ ప్రధాన కారణం అయ్యింది. నీరు అధికంగా తీసుకోవడం వల్ల మరణం సంభవిస్తుందా? అవును.. అలాంటి కేసులు మెడికల్‌ హిస్టరీలో బోలెడు నమోదు అయ్యాయి. చాలా ఎక్కువ నీటి వినియోగం ఇంట్రాక్రానియల్ ఒత్తిడిని (ICP)కి కారణం అవుతుంది. ఇది రకరకాల లక్షణాలకు, ఒక్కోసారి పరిస్థితులు తిరగబడి ప్రాణాల మీదకు కూడా తీసుకొస్తుంది. 

అసలు ఎంత తాగాలి.. 
ఒక వ్యక్తి తన మూత్రపిండాలు(కిడ్నీల) మూత్రం ద్వారా తొలగించగల దానికంటే ఎక్కువ నీటిని తీసుకుంటే 'ఓవర్‌హైడ్రేషన్' 'వాటర్ ఇంటాక్సికేషన్' సంభవిస్తాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. హైపోనాట్రేమియా, సెరిబ్రల్ ఎడెమా సందర్భాల్లో ఒక్కోసారి అధికంగా నీరు తీసుకున్న గంటలో కూడా మరణం సంభవించవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎంత నీరు తీసుకోవాలి?.. కొందరు రెండు, కొందరు మూడు, కొందరు ఐదు లీటర్లు అంటూ చెప్తుంటారు. కానీ,  శాస్త్రీయంగా దీనికంటూ ఓ పరిమితి లేదు. కానీ, గంటలో లీటర్‌ లోపు నీటిని మాత్రమే తీసుకోవాలని కొన్నిసార్లు సూచిస్తుంటారు వైద్య నిపుణులు. తద్వారా కిడ్నీలపై ఒత్తిడి ఉండదని చెప్తున్నారు. అంతేకాదు.. అతిగా నీటిని తీసుకోవడం మూలంగా మానసిక అనారోగ్యం కూడా సంభవించవచ్చని చెప్తున్నారు.

Read latest Sakshi Special News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top