
దరఖాస్తుదారుల్లో వీళ్లే ఎక్కువ పీఎం ఇంటర్న్‌షిప్
రెండో రౌండ్‌లో పరిస్థితి
4 రాష్ట్రాల నుంచే 42 శాతం దరఖాస్తులు
మొత్తం 1.19 లక్షల అవకాశాలు
ఆఫర్ చేస్తున్న 327 కంపెనీలు
పీఎం ఇంటర్న్‌షిప్.. దేశంలోని టాప్ – 500 కంపెనీల్లో యువత శిక్షణ పొంది, ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు సాధించేందుకు అద్భుతమైన వేదిక. మొదటి రౌండ్ మొత్తం పూర్తయిపోయి, రెండో రౌండ్ కూడా సగం పూర్తయింది. ఈ దశలో టాప్ – 4 రాష్ట్రాలలోనే సుమారు 50 వేల అవకాశాలు ఉన్నాయి. మొత్తం అవకాశాల్లో ఇవి దాదాపు 42 శాతం. అంటే.. పారిశ్రామికంగా అభివృద్ధి చెందినవీ, పట్టణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఎక్కువ అవకాశాలు అందిస్తున్నాయి. మరో ఆసక్తికర అంశం ఏంటంటే.. తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణల్లో గ్రాడ్యుయేషన్ అభ్యర్థుల తరవాత అత్యధిక ఇంటర్న్‌షిప్‌లకు దరఖాస్తు చేసింది పది పాసైనవారు.
ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం గ్రాడ్యుయేషన్ తరవాత.. ఐటీఐ వాళ్లు ఎక్కువగా ఉన్నారు. దేశంలోని 21–24 ఏళ్ల మధ్య ఉండే యువత ఉద్యోగ సాధనకు అవసరమయ్యే పూర్తిస్థాయి నైపుణ్యాలను.. అత్యుత్తమ కంపెనీల ద్వారా యువతకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2024లో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (పీఎంఐఎస్) తీసుకొచి్చంది. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ వంటి చదువులు పూర్తిచేసిన విద్యార్థులకు శిక్షణతోపాటు, నెలకు రూ.5,000 చొప్పున స్టైపెండ్ కూడా ఈ పథకం ద్వారా అందిస్తారు. దీంతోపాటు కంపెనీలో చేరేముందు వన్‌టైమ్ గ్రాంట్ కింద రూ.6,000 కూడా చెల్లిస్తారు. ఏడాదిలో 6 నెలలు క్లాస్ రూమ్‌లో, 6 నెలలు క్షేత్రస్థాయిలో శిక్షణ ఉంటుంది. ఏడాదికి రూ.8 లక్షల వార్షికాదాయం కలిగిన కుటుంబాలకు చెందినవారు దీనికి అర్హులు.

మొదటి రౌండ్‌లో..
ఈ ఏడాది మార్చిలో రాజ్యసభలో కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ చెప్పిన సమాధానం ప్రకారం.. 2024 అక్టోబర్‌లో ప్రారంభమైన పీఎంఐఎస్ పైలట్ ప్రాజెక్ట్ మొదటి రౌండ్‌లో... చివరికి 28,141 మంది ఆఫర్లు తీసుకుని ఆయా సంస్థల్లో శిక్షణకు హాజరయ్యారు. ఇందులో ఏపీ నుంచి 1,970, తెలంగాణ నుంచి 1,380 మంది ఉన్నారు. యూపీ నుంచి అత్యధికంగా 4,656 మంది, బిహార్ నుంచి 2,418 మంది స్వీకరించారు. మొదటి రౌండ్‌లో మొత్తం 1.27 లక్షల ఆఫర్లు రాగా.. వాటికోసం 6.21 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కంపెనీలు 82,077 మందిని ఎంపిక చేసుకుని ఇంటర్న్‌షిప్ ఆఫర్ చేశాయి.
గ్రాడ్యుయేషన్... ఐటీఐ
ఈసారి ఇంటర్న్‌షిప్‌లకు వచి్చన దరఖాస్తుల్లో ప్రధాన రాష్ట్రాల్లో గ్రాడ్యుయేషన్ అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు. ఆ తరవాత పదో తరగతి అభ్యర్థులు ముందంజలో ఉండటం విశేషం. తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, యూపీలలో ఇదే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం గ్రాడ్యుయేషన్ తరవాత ఐటీఐ వాళ్లు అధిక సంఖ్యలో ఉన్నారు. మే 20 నాటికి 4,710 దరఖాస్తులు వస్తే.. అందులో గ్రాడ్యుయేషన్ చేసినవాళ్లు 1,717 మంది కాగా, ఐటీఐ అభ్యర్థులు 1,040 మంది. అలాగే తెలంగాణలో 5,252 రాగా.. గ్రాడ్యుయేషన్ అభ్యర్థులు దాదాపు సగం అంటే.. 2,611 మంది ఉండటం విశేషం.
రెండో రౌండ్‌లో..
రెండో రౌండ్‌లో కంపెనీల సంఖ్య పెరిగింది. మొదటి దశలో 280 వస్తే ఇప్పుడు 327 కంపెనీలు ముందుకొచ్చాయి. ఇవి సుమారు 1.19 లక్షల ఇంటర్న్‌షిప్ అవకాశాలు అందిస్తున్నాయి. దేశంలోని 36 రాష్ట్రాల్లోని 735 జిల్లాల్లో యువతకు.. 25 రంగాల్లో నైపుణ్యం పొందే అవకాశం లభించింది. ఈసారి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లోని యువత పోటీపడ్డారు. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక.. ఈ నాలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 50 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి అత్యధిక ఇంటర్న్‌షిప్‌లు ఆఫర్ చేస్తున్న ప్రధాన రంగాలు.. చమురు, సహజవాయువు, ఇంధనం; పర్యాటకం, ఆతిథ్యం; బ్యాంకింగ్, ఆర్థిక సేవలు.. అత్యధిక ఇంటర్న్‌షిప్‌లు అందిస్తున్న టాప్ –3 రంగాలు.