ఇబ్రహీంపట్నం రూరల్: భర్త, పిల్లలను వదిలేసి ప్రియుడి వద్దకు వెళ్లిన వివాహిత అనుమానాస్పద కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడే హంతకుడని తేల్చి, నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఆదిభట్ల సీఐ ప్రదీప్‌కుమార్‌రెడ్డి, సీఐ రమేష్ గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా, కొండెపి మండలం, పెట్లూరు గ్రామానికి చెందిన కందిమల్ల కళ్యాణి (38)కి భర్త శ్రీనివాస్‌రావు, బీటెక్, ఇంటర్ చదువుతున్న కొడుకు, కూతురు ఉన్నారు. ఎనిమిదేళ్ల క్రితం కుటుంబాన్ని వదిలేసి ప్రియుడు నర్సింహమూర్తితో వెళ్లిపోయి, సహజీవనం చేస్తోంది. కళ్యాణి, నర్సింహమూర్తి నాదర్‌గుల్ సమీపంలోని శ్రీపురం కాలనీలో నివాసం ఉంటూ ఎంవీఎస్ కాలేజీలో పనిచేస్తున్నారు. కొద్ది రోజులుగా నిత్యం మద్యం తాగి వస్తున్న నర్సింహమూర్తి కళ్యాణితో గొడవ పడుతున్నాడు. ఈక్రమంలో ఈ నెల 13న తాగిన మైకంలో ఆమె మెడకు నైలాన్‌తాడు బిగించి హత్యచేశాడు. దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు రెండు రోజుల పాటు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచాడు. 15న ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు అందరికీ సమాచారం ఇచ్చి, ఇంట్లో నుంచి పారిపోయాడు. మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్న పోలీసులు కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్ చేరుకున్న కళ్యాణి తల్లిదండ్రులు ఆమె చనిపోయిన విషయాన్ని భర్త, పిల్లలకు తెలియకుండా నగరంలోని ఓ ఫౌండేషన్‌కు అప్పగించి అంత్యక్రియలు జరిపించి, కన్నీళ్లతో వెళ్లిపోయారు.
● వివాహిత హత్య కేసును ఛేదించిన ఆదిభట్ల పోలీసులు
● నిందితుడికి రిమాండ్


