గణేశ్‌ వేడుకలకు పటిష్ట బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

గణేశ్‌ వేడుకలకు పటిష్ట బందోబస్తు

Sep 18 2026 8:18 AM | Updated on Sep 18 2026 8:18 AM

మోదీని ఆశీర్వదించాలి దేశసేవకే జీవితాన్ని అంకితం చేసిన ప్రధాని మోదీని ప్రతిఒక్కరూ ఆశీర్వదించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కోరారు. 8లోu

మోదీని ఆశీర్వదించాలి దేశసేవకే జీవితాన్ని అంకితం చేసిన ప్రధాని మోదీని ప్రతిఒక్కరూ ఆశీర్వదించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కోరారు.

మహేశ్వరం జోన్‌ పరిధిలో

2,179 మండపాలు

నిమజ్జన విధులకు

400 మంది పోలీసులు

చెరువులు, మండపాల వద్ద

సీసీ కెమెరాలతో నిఘా

అందుబాటులో క్రెయిన్లు, రోలర్స్‌

‘సాక్షి’తో డీసీపీ నారాయణరెడ్డి

మహేశ్వరం: వినాయక వేడుకలను శాంతియుత వాతావరణం, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఉత్సవ కమిటీల సభ్యులు, మండపాల నిర్వాహకులు, శాంతికమిటీల సభ్యులు పోలీసుల సూచనలు పాటించాలన్నారు. నిమజ్జన ఘట్టంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావీయొద్దని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ‘సాక్షి’ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

ప్రశ్న: వినాయక చవితిని పురస్కరించుకుని భద్రతాపరంగా ఏయే ఏర్పాట్లు చేశారు?

జవాబు: మహేశ్వరం జోన్‌ పరిధిలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో వినాయక చవితి, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేందుకు అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాం. ముఖ్యమైన మండపాలు, రద్దీ ప్రాంతాలు, నిమజ్జన మార్గాల్లో ప్రత్యేక భద్రత కల్పిస్తున్నాం.

ప్రశ్న: భక్తుల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

జవాబు: నిమజ్జనాల కోసం 400 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నాం. ప్రధాన మండపాలు, చెరువుల వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణ, ట్రాఫిక్‌ నియంత్రణ, షీటీమ్స్‌, పెట్రోలింగ్‌ బృందాలను ఏర్పాటు చేశాం. అత్యవసర పరిస్థితుల్లో తక్షణం స్పందించేందుకు ప్రత్యేక బృందాలు, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉన్నాయి. గ్రామాల్లో శాంతి కమిటీలు ఏర్పాటు చేసి, విద్యుత్‌, ఇరిగేషన్‌, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం.

ప్రశ్న: మహేశ్వరం పరిధిలో ఎన్ని విగ్రహాలు ప్రతిష్ఠించారు?

జవాబు: మొత్తం 2,179 విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆయా మండపాలను పోలీస్‌ ఆన్‌లైన్‌ యాప్‌లో నమోదు చేశారు.

ప్రశ్న: ఏయే ప్రాంతాల్లో నిమజ్జనం చేస్తున్నారు..? ఇందుకోసం ఎన్ని చెరువులను గుర్తించారు?

జవాబు: ఇబ్రహీంపట్నం, తట్టిఖానా, శేరిగూడ చెక్‌డ్యామ్‌, మహేశ్వరం కేసీతండాలోని కొత్వాల్‌ చెరువు, అమీర్‌పేట్‌ చెరువు, ఆమనగల్లులోని సురసముద్రం చెరువు, కడ్తాల్‌లోని గౌరమ్మ చెరువుతో పాటు గ్రామాల్లోని చిన్నచిన్న చెరువులు, కుంటల్లో నిమజ్జనాలకు ఏర్పాట్లు చేశాం. ఇందుకోసం చెరువుల వద్ద క్రెయిన్లు, రోలర్స్‌, ఇతర వాహనాలను ఏర్పాటు చేశాం.

ప్రశ్న: ర్యాలీలు, శోభాయాత్రల్లో డీజేలకు అనుమతి ఉందా?

జవాబు: డీజేల వినియోగానికి అనుమతి లేదు. ఎవరైనా పెడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. భజనలు చేసుకుంటూ, భక్తి గీతాలు ఆలపిస్తూ, చిన్న మైకులు పెట్టుకొని ర్యాలీ నిర్వహించుకోవచ్చు. అతిక్రమిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదు.

ప్రశ్న: వినాయక మండప నిర్వాహకులకు మీ సూచనలు ఏమిటి?

జవాబు: అనుమతులకు అనుగుణంగా ఉత్సవాలు నిర్వహించాలి. శబ్ద కాలుష్య నియమాలు పాటించాలి. విద్యుత్‌, అగ్నిమాపక భద్రతా చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి.

ప్రశ్న: ప్రజలకు మీరిచ్చే సందేశం ఏమిటి?

జవాబు: ఏ పండుగలైనా శాంతియుతంగా, సామరస్య వాతావరణంలో జరుపుకోవాలి. ఏదైనా అనుమానాస్పద విషయం కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. శాంతి కమిటీల పర్యవేక్షణలో వేడుకలు నిర్వహించుకోవాలి.

ప్రశ్న: సోషల్‌ మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

జవాబు: సోషల్‌ మీడియాను నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. తప్పుడు వార్తలు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకుంటాం.

ప్రశ్న: ఊరేగింపులు నిర్వహించే వారికి మీరిచ్చే సలహాలు?

జవాబు: నిర్దేశిత సమయంలో విగ్రహాలను నిమజ్జనం చేయాలి. పోలీసులతో పాటు ఇతర శాఖల అధికారులకు సహకరించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement