ఇబ్రహీంపట్నం: గణేశ్ నిమజ్జన ఏర్పాట్లను మహేశ్వరం జోన్ డీసీపీ కె.నారాయణరెడ్డి గురువారం పరిశీలించారు. మున్సిపల్ పరిధిలోని శేరిగూడ చెక్ డ్యాం వద్ద చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించి ఏసీపీ కేపీవీ రాజు, సీఐ మహేందర్‌రెడ్డికి ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు, పార్కింగ్, విద్యుత్ అంశాలపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి మాట్లాడుతూ.. గణేశ్ నవరాత్రోత్సవాలు, నిమజ్జన కార్యాక్రమాలు ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులకు సహకరించాలని కోరారు.
షాబాద్: వినాయక నిమజ్జన ఊరేగింపు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ సూచించారు. షాబాద్ బడా వినాయకుడి వద్ద గురువారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులతో మాట్లాడారు. పైల్వాన్ చెరువును సందర్శించి నిమజ్జన ఏర్పాట్లు, భద్రతపై సీఐ లక్ష్మిరెడ్డి, అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిమజ్జానికి వచ్చే భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. చెరువు పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం చేయాలని, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆయన వెంట చేవెళ్ల ఏసీపీ కిషన్, సర్పంచ్ అశోక్, ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు.
ఇబ్రహీంపట్నం రూరల్: జిల్లాలోని కేజీబీవీ కిస్మత్‌పూర్, దర్గా ఖలీజ్ఞాన్‌లో వంట పని నిమిత్తం మహిళల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ కార్యాలయం గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం మూడు ఖాళీలు ఉన్నాయని, ఆసక్తిగల మహిళలు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. నెలకు గౌరవ వేతనం రూ. 9,750 చెల్లిస్తారని, దరఖాస్తు ఫారాలను ఆయా కేజీబీవీల్లో సమర్పించాలని సూచించింది.


