అసెంబ్లీలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ఆమనగల్లు: కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఆమనగల్లు, తలకొండపల్లి మండలాల పరిధిలో ఆయిల్ పామ్ రిఫైనరీని ఏర్పాటు చేయాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కోరారు. ఈమేరకు బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. కల్వకుర్తి ప్రాంతంలో 3,134 ఎకరాలలో ఆయిల్‌పామ్ సాగవుతోందని తెలిపారు. ఈ పంట సాగుతో రైతులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని, దీనిపై మరింత అవగాహన కల్పించాలని కోరారు. నీటి వనరులు తక్కువగా ఉన్న కల్వకుర్తి ప్రాంతంలో, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు. ప్రభుత్వం ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ముందుకువస్తే అవసరమైన భూమిని సమకూరుస్తామని స్పష్టంచేశారు. గతంలో పరిశ్రమ ఏర్పాటుకు అధికారులు ఈప్రాంతాన్ని పరిశీలించారన్నారు. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి అదనంగా స్ప్రింక్లర్లు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి కోరారు.
చల్లంపల్లిలో విద్యాకుసుమాలు
వరుసగా ఎంబీబీఎస్ సీట్లు సాధించిన అక్కాచెల్లెళ్లు
కడ్తాల్: మండల పరిధిలోని చల్లంపల్లి గ్రామానికి చెందిన గుర్క రామకృష్ణ, మంజుల దంపతుల కూతుళ్లు రెండేళ్ల వ్యవధిలో ఎంబీబీఎస్ సీట్లు సాధించి ఆదర్శంగా నిలిచారు. రెండేళ్ల క్రితం పెద్ద కూతురు హారిక ఎంబీబీఎస్ సీటు సాఽధించగా, తాజాగా చెల్లెలు జ్యోతిర్మయి కూడా ఎంబీబీఎస్‌లో సీటు సాధించింది.
కాచిగూడ: రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలం కమ్మదనం గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థిని అశ్విని అనుమానాస్పద మృతి ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ) తీవ్రంగా స్పందించింది. జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు, న్యాయవాది దుండ్ర కుమారస్వామి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, సమగ్ర నివేదికను మూడు ప్రతుల్లో 2026 నవంబర్ 9వ తేదీలోగా సమర్పించాలని కమిషన్ ఆదేశించింది. ఘటన జరిగిన తీరు, విద్యార్థుల భద్రత, హాస్టల్ పర్యవేక్షణ, అత్యవసర వైద్య సహాయం అందించడంలో అధికారుల బాధ్యత తదితర అంశాలపై వాస్తవాలను నివేదికలో స్పష్టంగా పేర్కొనాలని స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణను నవంబర్ 9న చేపట్టనున్నట్లు కమిషన్ వెల్లడించింది. ఈ సందర్భంగా పిటిషనర్ దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ... ప్రభుత్వ గురుకులాల్లో విద్యార్థుల ప్రాణాలు, భద్రతకు కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థ అవసరమన్నారు. అశ్విని మృతికి గల అసలు కారణాలు వెలుగులోకి తీసుకురావడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాల్లో వసతులు, భద్రత, మానసిక స్థైర్యాన్ని కల్పించే వ్యవస్థలపై మానవ హక్కుల ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా చూడటమే తమ ఫిర్యాదు ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.


