షాబాద్: చోరీకి వచ్చిన నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బుధవారం వారిని రిమాండ్‌కు తరలించారు. షాబాద్ సీఐ లక్ష్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని సింగరేణి కాలనీలో నివాసముంటున్న చరణ్, కిషిన్, నరేష్‌తో పాటు మరో బాలుడు మంగళవారం రాత్రి ఒకటిన్నర సమయంలో సంకేపల్లిగూడ, సీతారాంపూర్ గ్రామాల మధ్య నడుచుకుంటూ వెళ్తున్నారు. వీరిని గమనించిన పెట్రోలింగ్ పోలీసులు ప్రశ్నించగా పారిపోయేందుకు యత్నించారు. వెంబడించి పట్టుకుని షాబాద్ పీఎస్‌కు తరలించారు. వీరి నుంచి కట్టర్లు, కటింగ్ ప్లేయర్స్ తదిర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తమదైన తీరులో ప్రశ్నించగా చోరీకి వచ్చినట్లు చెప్పడంతో కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. వీరు వ్యవసాయ బావులు, బోర్ల వద్ద కేబుల్ వైర్లు, స్టార్టర్లు దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని సీఐ తెలిపారు. గ్రామాల్లో రాత్రి సమయాల్లో ఎవరైనా అనుమానితులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు.


