కొందుర్గు: మండలంలోని టేకులపల్లి ప్రాథమిక పాఠశాల నాలుగో తరగతి గదిలో గురువారం పాము కనిపించడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. స్కూల్‌లో విధులు నిర్వహించే పారిశుద్ధ్య కార్మికురాలు శిల్ప ఉదయం 8.45 గంటలకు గదులు శుభ్రం చేస్తుండగా నాగుపాము కనిపించింది. ఈ విషయాన్ని హెచ్‌ఎం లింగయ్యకు తెలియజేయడంతో గ్రామస్తుల సహకారంతో పామును కొట్టి చంపడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.
అనంతగిరి: వికారాబాద్ పట్టణ పరిధిలోని శివసాగర్ చెరువు ఆధునికరణకు ప్రణాళికలు, డీపీఆర్ సిద్ధం చేయాలని కలెక్టర్ దీపక్ తివారి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. గురువారం చైర్ పర్సన్ గడ్డం అనన్యతో కలిసి చెరువు పరిసరాలను పరిశీలించారు. పర్యాటకులను ఆకట్టుకునే విధంగా సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం ఎన్నెపల్లిలోని షాదీఖానాను పరిశీలించి మరమ్మతులు చేయించాలని సూచించారు. ఆయన వెంట అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


