పహాడీషరీఫ్: ఇద్దరు కూతుళ్లతో కలిసి గృహిణి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసకుంది. ఎస్‌ఐ ఎల్.వెంకటేశ్వర్లు గురువారం తెలిపిన వివరాల ప్రకారం.. రంగనాయకుల కాలనీకి చెందిన సల్లంగుల నాగరాజు, లక్ష్మి (31) దంపతులు. వారికి ముగ్గురు సంతానం. రోజు మాదిరిగానే ఈ నెల 16న ఉదయం 7 గంటలకు నాగరాజు విధుల నిమిత్తం వెళ్లి సాయంత్రం వచ్చి చూడగా కుమారుడు శివ ఒక్కడే ఇంట్లో ఉన్నాడు. భార్య, కూతుళ్లు లావణ్య (13), లహరి (9) విషయమై కుమారుడిని ఆరా తీయగా కడుపు నొప్పి కారణంగా వారు స్కూల్‌కు రాకపోవడంతో తానొక్కడినే వెళ్లి వచ్చానని చెప్పాడు. వారి ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో గానీ, 87126 62367 నంబర్‌లోగానీ సమాచారం ఇవ్వాలని సూచించారు.


