సరైన పరిహారం ఇవ్వాలి
విలువైన భూములు పోతాయి
షాద్‌నగర్: భూ పరిహారంలో వివక్షపై రైతులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా షాద్‌నగర్ నియోజకవర్గంలోని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు సంబంధించి సేకరించే భూముల విషయంలో అన్యాయానికి గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు రేడియల్ రోడ్డుకు అధిక మొత్తంలో చెల్లిస్తూ.. తమ భూములు మాత్రం తక్కువ ధరకు కొనాలని ప్రభుత్వం భావిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రేడియల్ రోడ్డుకు ఇలా..
షాద్‌నగర్, పరిగి నియోజకవర్గాల పరిధిలోని పలు గ్రామాల్లో రేడియల్ రోడ్డు నిర్మాణం కోసం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇందుకు గాను ఆయా గ్రామాల్లో భూసేకరణ వేగవంతం చేశారు. రైతులకు ఒక్కో ఎకరానికి ప్రభుత్వం రూ.40లక్షల చొప్పున చెల్లించింది. దీంతో రైతులు సంతోషంగా తమ భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఆయా గ్రామాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి ఎలాంటి వివాదాలు చోటు చేసుకోలేదు.
తక్కువ ఇస్తే అంగీకరించేది లేదు
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా షాద్‌నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదరిగూడ మండలంలో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఏర్పాటు కోసం ప్రభుత్వం భూ సేకరణకు చర్యలు చేపట్టింది. సుమారు 300 ఎకరాలకు పైగా భూమిని ఇక్కడి రైతుల నుంచి సేకరిస్తున్నారు. పరిహారం విషయంలో ఇప్పటికీ సరైన స్పష్టత లేదు. రేడియల్ రోడ్డు నిర్మాణం కోసం సేకరించే భూములకు ఏవిధంగా పరిహారం ఇస్తుందో అదేవిధంగా తమకూ చెల్లించాలని భూములు కోల్పోయే రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గత నెలలో రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి భూ సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. ఆశించిన పరిహారం ఇచ్చేంత వరకు సర్వే చేయనిచ్చేది లేదని స్పష్టం చేశారు. మరి ప్రభుత్వం వీరికి ఏవిధంగా నచ్చజెబుతుందో, ఏ మేరకు పరిహారం చెల్లిస్తుందో వేచి చూడాలి.
సేకరించే భూమి వివరాలు ..
● ప్యాకేజీ 19 కింద మహబూబ్‌నగర్‌జిల్లా ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి షాద్‌నగర్ పరిధిలోని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ వరకు 32 కిలోమీటర్ల కాల్వను నిర్మించనున్నారు. సొరంగాలు, బహిరంగ కాల్వల కోసం 1,355 ఎకరాల భూమిని సేకరించనున్నారు.
● ప్యాకేజీ 20 కింద పంప్ హౌస్ నిర్మాణం కోసం రంగారెడ్డి జిల్లా పద్మారంలో 52 ఎకరాలు సేకరిస్తారు.
● ప్యాకేజీ 21 కింద రిజర్వాయర్ కట్ట నిర్మాణం కోసం 1,512 ఎకరాలు సేకరించనున్నారు. ఇందులో వికారాబాద్ జిల్లా పరిగి మండలం సైదుపల్లిలో 903, కుల్కచర్ల మండలం అల్లాపూర్‌లో 343, రంగారెడ్డి జిల్లా జిల్లేడు చౌదరిగూడ మండలం పద్మారంలో 266 ఎకరాలు సేకరించనున్నారు.
రేడియల్ రింగ్ రోడ్డు నిర్మాణం ఇలా
రాజధాని శివారులోని బుద్వేల్ వద్ద ప్రారంభమై శంషాబాద్, షాబాద్, షాద్‌నగర్ పరిఽధిలోని కొందుర్గు మండలం చుక్కమెట్, ముట్పూరు, లాలాపేట్, ఉమ్మెంత్యాల, లచ్చంపేట గ్రామాల మీదుగా రేడియల్ రోడ్డు నిర్మించేందుకు ప్రభుత్వం ఇప్పటికే రైతులకు ఎకరాకు రూ.40 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. వికారాబాద్ జిల్లా పరిగి పరిధిలోని ఆబాజీగూడ, చిట్యాల, గూడూరు, సైదుపల్లి, మీదుగా కొడంగల్ వరకు నిర్మించనున్నారు.
లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌కు భూ సేకరణ
పరిహారం విషయంలో కరువైన స్పష్టత
రేడియల్ రోడ్డుకు ఎకరానికి రూ.40లక్షలు
తమకూ అంతే ఇవ్వాలంటున్న రైతులు
వివక్ష చూపిస్తే అంగీకరించేదిలేదని స్పష్టీకరణ
ఎకరాకు చెల్లించే నష్టపరిహారం : రూ.12 లక్షలు
సేకరించనున్న మొత్తం భూమి : 2,919 ఎకరాలు
అంచనా వేసిన పరిహారం మొత్తం : రూ.350.84కోట్లు
రిజర్వాయర్ నీటి సామర్థ్యం : 2.9 టీఎంసీలు
రిజర్వాయర్ పూర్తయితే నీరందించే భూ విస్తీర్ణం : సుమారు 4 లక్షల ఎకరాలు
రిజర్వాయర్ నిర్మాణంలో మాకున్న పొలంలో 9 ఎకరాలు పోతోంది. ప్రభుత్వం సరైన పరిహారం చెల్లించాలి. రీజినల్ రోడ్డు కోసం సేకరించే భూములకు ఏవిధంగా ఇస్తున్నారో అదేవిధంగా మాకూ ఇవ్వాలి.
– మొగిలిగిద్ద మల్లమ్మ, పద్మారం, జిల్లేడు చౌదరిగూడ
లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రిజర్వాయర్ నిర్మాణంలో మా విలువైన భూములు కోల్పోవాల్సి వస్తోంది. ప్రభుత్వం న్యాయమైన పరిహారం చెల్లించాలి.
– నారాయణగౌడ్, పద్మారం, జిల్లేడు చౌదరిగూడ


