మహేశ్వరం: మహేశ్వరం మండల పరిధిలోని కొంగర ఖుర్దు–ఎలో ఇండస్ట్రీయల్, ఐటీ పార్కు ఏర్పాటు కోసం భూములు కోల్పోతున్న రైతులకు గురువారం కందుకూరు ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. ఎకరాకు రూ.కోటితో పాటు హెచ్‌ఎండీఏ నిబంధనల ప్రకారం 121 గజాల ప్లాటు పరిహారంగా ఇవ్వడం జరుగుతుందని ఆర్డీఓ తెలిపారు. మొదటి విడదలో భాగంగా కొంత మంది రైతులకు ఇప్పటికే చెక్కులు ఇవ్వగా, గురువారం మరికొంతమంది రైతులకు అందజేశారు. కొన్ని అభ్యంతరాలు ఉండడంతో అందరికీ పరిహారం ఇవ్వలేకపోయామని, త్వరలో సమస్యను పరిష్కరించి రైతులందరికీ పరిహారం అందజేసి భూమిని స్వాధీనం చేసుకుంటామన్నారు. కార్యక్రమంలో మహేశ్వరం తహసీల్దార్ చిన్న అప్పలనాయుడు, ల్యాంగ్ అక్విజేషన్ డిప్యూటీ తహసీల్దార్ రాజు, ఆర్‌ఐ రాజిరెడ్డి, జీపీఓలు అరుణ్ పాల్గొన్నారు.


