3న జిల్లా స్థాయి ఎంపిక పోటీలు | - | Sakshi
Sakshi News home page

3న జిల్లా స్థాయి ఎంపిక పోటీలు

Aug 30 2026 7:24 AM | Updated on Aug 30 2026 7:24 AM

హుడాకాంప్లెక్స్‌: ఆలిండియా క్రీడా పోటీలకు సంబంధించి 2026–2027 సంవత్సరానికి గాను ఎంపికలు నిర్వహించనున్నట్టు జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్‌.స్వర్ణలత శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వచ్చేనెల 3న జిల్లా స్థాయి ఎంపికలు ఉంటాయని తెలిపారు. ఆసక్తికలిగిన జిల్లాకు చెందిన సివిల్‌ సర్వీసెస్‌ ఎంప్లాయీస్‌ క్రీడాకారులు వచ్చేనెల 1న ఉదయం 11.30 గంటలకు సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో పేర్లు నమోదు చేసుకో వాలని సూచించారు. ఇతర వివరాలకు జిల్లా యువజన, క్రీడల అధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

విద్యాశాఖ కార్యక్రమాల అమలుపై సమీక్ష

ఇబ్రహీంపట్నం రూరల్‌: ప్రతి ఒక్కరూ చదువుకోవాలని, అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం జిల్లా విద్యాశాఖ కార్యక్రమాల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ప్రీ ప్రైమ రీ విద్యను మరింత బలోపేతం చేయాలని అన్నారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల మెరుగుదలతోపాటు విద్యా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుదల తదితర అంశాలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో ఎంఈఓలు, కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

ఘనంగా జాతీయక్రీడా దినోత్సవం

హుడాకాంప్లెక్స్‌: హాకీ దిగ్గజం, భారత క్రీడా చరిత్రలో చిరస్మరణీయ క్రీడాకారుడు ధ్యాన్‌చంద్‌ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని శనివారం సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ క్రీడల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు బ్యాడ్మింటన్‌ కోచ్‌ ఎంవీ ఫణికిషోర్‌ పతకాలు, జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా క్రీడల ప్రాధాన్యత, ఆరోగ్యకరమైన జీవనశైలి, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించారు. ధ్యాన్‌చంద్‌ చూపిన క్రీడా ప్రతిభ, క్రమశిక్షణ, అంకితభావాన్ని నేటి యువ క్రీడాకారులు ఆదర్శంగా తీసుకోవలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడా విభాగానికి చెందిన సిబ్బంది, వివిధ క్రీడల కోచ్‌లు, స్టేడియంలో ఆయా క్రీడాంశాల్లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు పాల్గొన్నారు.

సైనికులకు రాఖీలు పంపిన విద్యార్థులు

మీర్‌పేట: రాఖీ పౌర్ణమి సందర్భంగా జమ్మూ లోని సీఆర్‌పీఎఫ్‌ సైనికులకు మీర్‌పేట నాగార్జున మాంటిస్సోరి ఐఐటీ ఒలింపియాడ్‌ పాఠశాల విద్యార్థులు స్వయంగా తయారు చేసిన రాఖీలను వారం రోజుల క్రితం పంపించారు. విద్యాసంస్థల చైర్మన్‌ గుమ్మకొండ విఠల్‌రెడ్డి మాట్లాడుతూ.. శుక్రవారం విధులు ముగిసిన అనంతరం సైనికులు రాఖీలు కట్టుకుని తమ ఆనందాన్ని ఫొటోలు, వీడియోల ద్వారా వాట్సాప్‌లో పోస్టు చేసినట్లు తెలిపారు. సీఆర్‌పీఎఫ్‌ విభాగంలో పనిచేసే కుటుంబాలకు సంబంధించి సుమారు రెండు వందల మంది విద్యార్థులు తమ పాఠశాలలో చదువుకుంటున్నారని చెప్పారు. దేశ రక్షణ కోసం నిరంతరం పనిచేసే సైనికులు ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో జీవించాలనే ఆకాంక్షతో విద్యార్థులు రాఖీలు పంపినట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement