అప్రమత్తంగా ఉండాలి
కొత్తూరు: ప్రస్తుతం అన్ని రంగాల్లో ఇంటర్‌నెట్ వినియోగం రోజురోజుకూ పెరుగుతుంది. బ్యాంకింగ్, విద్య, ఉద్యోగాలు, వ్యాపారాలు, సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. సౌకర్యాలు ఎంతలా పెరిగాయో సైబర్ నేరాలు కూడా అంతేస్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. ఇటీవలి కాలంలో అమాయకులతో పాటు విద్యావంతులు, ఉద్యోగులు, కార్మికులు సైబర్ నేరగాళ్ల వలలో పడి రూ.లక్షల్లో పోగొట్టుకుంటున్నారు. సైబర్ నేరాలపై పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు.
నమ్మించి.. నట్టేట ముంచి
● సైబర్ నేరస్తులు ముందుగా ఎంచుకున్న వారికి గుర్తు తెలియని నంబర్ల నుంచి వరుస పెట్టి కాల్స్ చేస్తారు.
● తాము ఫలానా బ్యాంకు, కళాశాల, పోలీసులం అంటూ రకరకాలుగా పరిచయం చేసుకుంటూ భయపెడుతూ, ఆశపెడుతూ నెమ్మదిగా వలలోకి దింపుతారు.
● తర్వాత బ్యాంకు ఈకేవైసీ అప్‌డేట్, ఇతర సహాయం చేస్తామని అనుమానం రాకుండా ఆధార్, ఓటీపీలను తెలుసుకుంటారు.
● ఒక్కసారి ఓటీపీ, ఇతర వివరాలు చెప్పగానే ఫోన్, ఇతర సామాజిక మాధ్యమాలను హ్యాక్ చేసి పూర్తి వివరాలు సంగ్రహిస్తారు.
● చివరగా నేరస్తులు ఆలస్యం చేయకుండా వెంటనే బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బును వారికి తెలియకుండానే ఇతర ఖాతాలు, ఆన్‌లైన్‌లోకి మళ్లించి నట్టేట ముంచుతారు.
● సైబర్ నేరాల్లో ముఖ్యంగా సామాజిక మాధ్యమాల హ్యాకింగ్, ఫిషింగ్, మాల్వేర్ ద్వారా డేటా చోరీ, ఈ మొయిళ్లు, వ్యక్తిగత వివరాల చోరీ చోటుచేసుకుంటున్నారు.
మచ్చుకు కొన్ని ఘటనలు..
● జార్ఖండ్ రాష్ట్రం రామ్‌ఘడ్ జిల్లా, వెస్ట్ బోకారోకు చెందిన రమేష్ కేవత్ కొన్ని నెలలుగా కొత్తూరు పట్టణంలోని ఓ హాస్టల్‌లో ఉంటూ నందిగామ మండలంలో ఉన్న పిత్తిల్యామినేషన్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. ఈనెల 6న రాత్రి సమయంలో తన మొబైల్‌ఫోన్ అప్‌డేట్ అవుతున్నట్లు గమనించాడు. మరుసటి రోజు ఉదయం జైహింద్ అనే వ్యక్తి రమేష్‌కు ఫోన్‌చేసి ఎల్‌ఐసీ రెన్యూవల్ చేస్తానని నమ్మించి బ్యాంకు ఖాతా, ఇతర వివరాలు తస్కరించాడు. విడతల వారీగా అతడికి తెలియకుండా ఈ నెల 7, 8 తేదీల్లో ఆన్‌లైన్, ఖాతాలకు రూ.1,89,200 బదిలీ చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న బాధితుడు సైబర్‌క్రైం నంబర్ 1930కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేశాడు.
● కొత్తూరు పట్టణంలోని పెంజర్ల రోడ్డులో నివసిస్తున్న యతేందర్‌కుమార్ సింగ్ నందిగామ మండలంలోని ఓ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 8న తన భార్యతో ఫోన్ మాట్లాడుతున్న క్రమంలో ఉన్నట్టుండి ఫోన్ అప్‌డేట్ అవుతున్నట్లు గమనించాడు. అప్‌డేట్ తర్వాత బ్యాంకు ఖాతా నుంచి రూ.1,18,000 ఇతర ఖాతాలు, ఆన్‌లైన్‌లకు బదిలీ అయినట్లు గుర్తించాడు. తన మొబైల్ ఫోన్ హ్యాక్ అయినట్లు గుర్తించి సైబర్ క్రైం 1930కు ఫిర్యాదు చేశాడు.
సైబర్ వల.. చిక్కారో విలవిల
నేరగాళ్ల సరికొత్త ఎత్తుగడలు
ఆశపెడుతూ.. భయపెడుతూ ఫోన్‌కాల్స్
వివరాలు చెప్పారో ఖాతాలు ఖాళీ
లబోదిబోమంటున్న బాధితులు
అవగాహన కల్పిస్తున్నా పడని అడ్డుకట్ట
కొత్తూరుకు చెందిన అన్నె మానస, సురేష్ బాబు దంపతులు. పెంజర్ల రోడ్డులో ఉన్న ఓ వెంచర్‌లో ఇల్లు కట్టుకోవడానికి ఓ బ్యాంకులో రూ.73 లక్షల రుణం తీసుకున్నారు. వాటిని మండలకేంద్రంలో ఉన్న యూనియన్ బ్యాంకులో మానస ఖాతాలో జమచేశారు. ఇంటి నిర్మాణం కోసం కొంత నగదు డ్రా చేశారు. మరోసారి అవసరం ఉండి ఆమె బ్యాంకుకు రాగా అకౌంట్‌లో రూ.748 మాత్రమే ఉండడంతో కంగుతిన్నారు. అకౌంట్‌లో బదిలీ వివరాలు పరిశీలించగా గత నెల 12 నుంచి ఈ నెల 9వ తేదీ వరకు ఆమెకు తెలియకుండానే రూ.16,78,000 విడతల వారీగా ఇతర ఖాతాల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. జరిగిన మోసాన్ని తెలుసుకుని పోలీసులు, సైబర్‌క్రైంను ఆశ్రయించారు.
సైబర్ నేరాలపై ఇప్పటికే పోలీసులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. అపరిచిత వ్యక్తులు చేసే ఫోన్‌కాల్స్‌కు స్పందించొద్దు. వారు అడిగే వివరాలు ఏమాత్రం చెప్పొద్దు. అపరిచితుల నంబర్ల నుంచి సామాజిక మాధ్యమాలకు వచ్చే ఏపీకే ఫైల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దు. మోసాలకు గురైతే వెంటనే 1930కి ఫిర్యాదు చేయాలి.
– నర్సయ్య, సీఐ, కొత్తూరు


