కాంగ్రెస్‌ చేసిందేమీ లేదు | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ చేసిందేమీ లేదు

Jun 29 2026 7:21 AM | Updated on Jun 29 2026 7:21 AM

వికారాబాద్‌: జిల్లాకు కేసీఆర్‌ చేసిన అభివృద్ధి మినహాయిస్తే అధికార కాంగ్రెస్‌ చేసిందేమీ లేదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి విమర్శించారు. ఆదివారం పట్టణంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌ బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్‌ అధ్యక్షతన సర్‌, పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, మాజీ మంత్రి సబితారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సబితారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ చేసిన అభివృద్ధి సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఉంటుందన్నారు. రోడ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలు అంటూ జిల్లాలో 20 గ్రామాల్లో రైతులు, పేదల భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ రైతుల పక్షాన నిలిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. పోలీసులను అడ్డంపెట్టుకుని చేసే కాంగ్రెస్‌ అరాచకాలను సహించేదిలేదని హెచ్చరించారు. మహిళలను కోటీశ్వరులను చేస్తానంటున్న సీఎం ముందు వారిని లక్షాధికారులను చేయాలని.. రాష్ట్రంలో ఉన్న కోటి నలభై లక్షల మందికి నెలకు ఇస్తామన్న రూ.2,500 వెంటనే ఇవ్వాలన్నారు.

కోటలను కూలగొడదాం: ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

బీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. అఽధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారు.. స్పీకర్‌, సీఎం కోటలను కూలగొడదాం.. కార్యకర్తలు కలిసికట్టుగా పని చేస్తే ఇది సాధ్యమే.. కాంగ్రెస్‌ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడుదాం.. కాంగ్రెస్‌, బీజేపీల అక్రమ పొత్తులపై అప్రమత్తంగా ఉందామన్నారు. అనంతరం బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్‌ మాట్లాడుతూ.. స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ మాటలు కోటలు దాటుతున్నాయి కాని కాలు కడప దాటడంలేదని ఎద్దేవా చేశారు. వికారాబాద్‌లో సమస్యలు పరిష్కరించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారన్నారు. నాడు సీఎంగా కేసీఆర్‌ పాలనను..నేడు రేవంత్‌ పాలనను.. వికారాబాద్‌లో నేను చేసిన అభివృద్ధి.. ఇప్పుడు ప్రసాద్‌కుమార్‌ చేస్తున్న అభివృద్ధిని ప్రజలు పోల్చి చూడాలన్నారు. లక్ష కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తానంటున్న సీఎం ఇక్కడ వికారాబాద్‌లో మూసీ పుట్టుకలో జరుగుతున్న కాలుష్యాన్ని పట్టించుకోవంలేదన్నారు. అనంతరం పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్‌ ఇన్‌చార్జి గట్టు రాంచందర్‌రావు మాట్లాడుతూ.. ఇంత అధ్వానమైన పాలన ఎక్కడా లేదన్నారు. సీఎం నియోజకవర్గం కొడంగల్‌ నుంచి నేటికి వలసలు పోతు న్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, విద్యా మౌలిక వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌, బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్‌, జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

మాజీ మంత్రి సబితారెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement