● కార్యకర్తలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపు
● శంషాబాద్ ఊట్‌పల్లిలో పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభం
శంషాబాద్: పార్టీ పటిష్టత కోసం కార్యకర్తలు కృషి చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పిలుపునిచ్చారు. శంషాబాద్‌లోని ఊట్‌పల్లిలో ఏర్పాటు చేసిన పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆదివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం నుంచి అవినీతి కాంగ్రెస్ సర్కారును సాగనంపే శక్తి బీజేపీకి మాత్రమే ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన వారి కల నెరవేరాలంటే బీజేపీ సర్కారు గద్దెనెక్కాల్సిందేనన్నారు. కార్యకర్తలు కొత్త కార్యాలయాలను కేవలం భవనాలుగా చూడకుండా సంకల్ప కేంద్రాలుగా మల్చుకోవాలని సూచించారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ శ్రేష్ట భారత్ కోసం చేసిన కృషిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు. రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పార్టీ వికసించేలా నేతలు కష్టపడాలన్నారు. అంతకు ముందు నితిన్ నబీన్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ రాష్ట్ర నేతలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో చేవెళ్ల, మల్కాజ్‌గిరి ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు పంతంగి రాజ్‌భూపాల్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, అందెల శ్రీరాములు యాదవ్, తోకల శ్రీనివాస్‌రెడ్డి, అందె బాబయ్య, నోముల దయానంద్, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, అంజన్‌కుమార్‌గౌడ్, పోరెడ్డి నర్సింహారెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు దేవేందర్‌రెడ్డి, నారాయణ యాదవ్, జ్ఞానేశ్వర్, కొమరయ్య, జిల్లా మీడియా కన్వీనర్ సాధ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


