షాద్‌నగర్‌రూరల్: కార్మికులంతా సంఘటితంగా పోరాడితేనే సమస్యలు పరిష్కారమవుతాయని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్ అన్నారు. పట్టణంలోని యూనివర్సల్ మినీ ఫంక్షన్‌హాలులో ఆదివారం తెలంగాణ యంగ్ వర్కర్స్ జిల్లాస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంఘటిత, అసంఘటిత రంగాల్లో పని చేస్తున్న యువ కార్మికులకు కనీస వేతనాలు, సామాజిక భద్రత, ఉద్యోగ రక్షణవంటి హక్కులు దక్కాలంటే పోరాటం ఒక్కటే మార్గమని అన్నారు. ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ విధానాలతో యువ కార్మికులు తీవ్ర దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక చట్టాల అమలులో నిర్లక్ష్యం కారణంగా అసంఘటితరంగ కార్మికుల సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయని పేర్కొన్నారు. అనంతరం యంగ్ వర్కర్స్ జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. నూతన కమిటీ జిల్లా కన్వీనర్‌గా అల్లిదేవేందర్, సభ్యులుగా కవిత (భవన నిర్మాణ సంఘం), స్వప్న(కాంట్రాక్ట్ వర్కర్), సాయి (కాటేదాన్ క్లస్టర్), మల్లేష్ (నాట్కో ఇండస్ట్రీ), అంజి, నర్సింహ (చందనవెల్లి ఇండస్ట్రీ), గోపాల్, చందు(సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు), దిలీప్ (కాంట్రాక్ట్ వర్కర్), పరమేశ్వరి (మధ్యాహ్న భోజన కార్మికురాలు), రాజు (హమాలీ కార్మికుడు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రుద్రకుమార్, జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, ఉపాధ్యక్షులు రాజు, మల్లేష్, స్వప్న, పెంటయ్య, వీరయ్య, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఈశ్వర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్


