ప్రాణం తీసిన ఆర్థిక ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన ఆర్థిక ఇబ్బందులు

Jun 29 2026 7:21 AM | Updated on Jun 29 2026 7:21 AM

శంకర్‌పల్లి: ఆర్థిక ఇబ్బందులతో దంపతులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన మోకిల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని జన్వాడకి చెందిన బాలసాయి (32), సంగారెడ్డి జిల్లా కంది మండలం జుల్కల్‌ గ్రామానికి చెందిన పద్మ (25) ఏడాదిన్నర క్రితం పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. బాలసాయి నగరంలోని పటేల్‌గూడలో ఓ గదిని అద్దెకి తీసుకుని ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ప్రస్తుతం వీరికి ఐదు నెలల బాబు ఉన్నాడు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇద్దరూ తమ బాబుని తీసుకొని మూడు రోజుల క్రితం జన్వాడకి వచ్చారు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో దంపతులు ఇంట్లో తలుపులు వేసుకొని, ఫ్యాన్‌కి ఉరివేసుకున్నారు. బాలుడి ఏడుపు విన్న కుటుంబసభ్యులు ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా దంపతులు విగతజీవులుగా పడి ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను కిందకు దించారు. పోస్టుమార్టం నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సురేశ్‌ తెలిపారు.

ఉరివేసుకుని దంపతుల బలవన్మరణం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement