ఏ రైలు ఎప్పుడొచ్చేనో! | - | Sakshi
Sakshi News home page

ఏ రైలు ఎప్పుడొచ్చేనో!

Jun 29 2026 7:21 AM | Updated on Jun 29 2026 7:21 AM

ఏ రైలు ఎప్పుడొచ్చేనో! ఏళ్లు గడిచినా మారని ఎంఎంటీఎస్‌ తీరు

ఏళ్లు గడిచినా మారని ఎంఎంటీఎస్‌ తీరు

సాక్షి, సిటీబ్యూరో: ప్రజారవాణా వ్యవస్థకు ‘లైఫ్‌లైన్‌’గా పట్టాలెక్కిన ఎంఎంటీఎస్‌ మసకబారుతోంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంచుమించు అన్ని మార్గాల్లో సర్వీసులు నిలిచిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 26 ఏళ్ల క్రితం నగరంలో ఈ రైళ్లను ప్రవేశపెట్టినప్పుడు రాజధాని వంటి సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ల కంటే వీటికే ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని భావించినా పరిస్థితి అధ్వానంగా మారింది. ఒకప్పుడు ప్రతిరోజూ 121 సర్వీసులు నడిచాయి. 1.5 లక్షల మంది ప్రయాణం చేశారు. ఇప్పుడు ఈ సర్వీసుల సంఖ్య 80కి తగ్గింది. 40 వేల మంది కూడా ప్రయాణం చేయడం గగనమైంది. మరోవైపు వివిధ కారణాలతో సర్వీసులను రద్దు చేయడం గమనార్హం.

పిటీ.. సిటీ బస్‌ కనెక్టివిటీ..

● ఎంఎంటీఎస్‌ సేవలను బలోపేతం చేసేందుకు 53 స్టేషన్లకు సిటీ బస్సులతో కనెక్టివిటీని ఏర్పాటు చేయాలని ఇటీవల ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు ఆర్టీసీ, జీహెచ్‌ఎంసీ, రైల్వే, హుమ్టా తదితర విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు రెండు, మూడు దఫాలుగా సమావేశమయ్యారు. ఎంఎంటీఎస్‌ స్టేషన్లలో పార్కింగ్‌ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని, అన్ని వాహనాలు సులభంగా రాకపోకలు సాగించేందుకు బఫర్‌ జోన్లలను ఖరారు చేయాలని నిర్ణయించినా ఓ ఒక్కటీ ఆచరణకు నోచుకోలేదు.

● ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు ఎంఎంటీఎస్‌ సర్వీసులు లేకపోవడంతో దూరప్రాంతాల నుంచి రైళ్లలో ప్రధాన స్టేషన్లకు చేరుకొనే ప్రయాణికులు ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు.

● చర్లపల్లి నుంచి ప్రతి రోజు 5 వేల మందికిపైగా రాకపోకలు సాగిస్తున్నారు. ఉదయం, సాయంత్రం మాత్రమే 2 ఎంఎంటీఎస్‌ సర్వీసులు నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

● సుమారు రూ.850 కోట్లకు పైగా వ్యయంతో రెండో దశ లైన్‌లు నిర్మించినప్పటికీ సరీసులు మాత్రం విస్తరణకు నోచడం లేదు.

ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు నో సర్వీస్‌

రోజు రోజుకూ మసకబారుతున్న సేవలు

కొరవడిన సమయపాలన, సర్వీసుల కుదింపు

1.5 లక్షల నుంచి 40 వేలకు తగ్గిన ప్రయాణికులు

ప్రస్తుతం ఉందానగర్‌ నుంచి ఫలక్‌నుమా, సికింద్రాబాద్‌ మీదుగా లింగంపల్లి వరకు, మేడ్చల్‌ నుంచి సికింద్రాబాద్‌ మీదుగా ఫలక్‌నుమా, ఉందానగర్‌ వరకు, లింగంపల్లి నుంచి నాంపల్లి మీదుగా ఫలక్‌నుమా, లింగంపల్లి వరకు నడుస్తున్నాయి. లింగంపల్లి నుంచి తెల్లాపూర్‌ వరకు రెండోదశలో విస్తరించినా రైళ్లు పట్టాలెక్కలేదు.

ప్రతి నెలా వందల కొద్దీ ఎంఎంటీఎస్‌ సర్వీసులు రద్దవుతున్నాయి. శని, ఆదివారాలే కాకుండా సాధారణ పనిదినాల్లో కూడా సర్వీసులు రద్దు కావడంతో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు, వ్యాపారులు, సాధారణ ప్రయాణికులు ఎంఎంటీఎస్‌కు దూరమవుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement