ఐదు తులాల బంగారు ఆభరణాలు అపహరణ
కుల్కచర్ల: తాళం వేసిన ఇంటికి గుర్తు తెలియని దుండగులు కన్నం వేశారు. ఈ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ రమేశ్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని ఎర్రగోవింద్ తండా అనుబంధ గ్రామం ఒంటి గుడిసె తండాకు చెందిన బానావత్ సంతోశ్ నాయక్ రాత్రి కుటుంబీకులతో కలిసి ఇంటిపై పడుకున్నాడు. ఆదివారం ఉదయం లేచి చూడగా తాళం పగులగొట్టి ఉంది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్లూస్ టీం సాయంతో వివరాలు సేకరించారు. ఈ చోరీలో ఐదు తులాల బంగారు ఆభరణాలు, రూ.30 వేల నగదు అపహరణ గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
పవర్ విండర్లతో
పని సులువు
ధారూరు: మండలంలోని కేరెళ్లి, కొండాపూర్‌ఖుర్దు, ఎబ్బనూర్, ధారూరు, చింతకుంట, హరిదాస్‌పల్లి, బాచారం గ్రామాల్లో రైతులు ఆదివారం పసుపు విత్తన పనులు ప్రారంభించారు. చాలమంది బోదెకందిని విత్తగా.. ఇంకొందరు సాళ్ల రూపంలో విత్తారు. 5 సంవత్సరాల నుంచి 50 ఎకరాలకు మించని పసుపు సాగు.. ఈ ఏడు 400 ఎకరాల వరకు విస్తిరించినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం విత్తనం బోదెలు కొట్టి వేయించగా.. విత్తనంపై మట్టి పోయించేందుకు రైతులు పవర్ విండర్‌లను వినియోగిస్తున్నారు. వీటి వలన కూలీల కొరత ఉన్నా.. పని సులువుగా అవుతోందని, ఎకరాకు రూ.2,500 చొప్పున చెల్లిస్తున్నామని రైతులు చెప్పారు. పవర్ విండర్లు అందుబాటులోకి రావడంతో సాగు సులభమైందని, విస్తీర్ణత పెరిగిందని పేర్కొంటున్నారు. విత్తనం విత్తిన తర్వాత వర్షాలు పడకున్నా.. ఏం కాదని తెలిపారు. ఎక్కువ మొత్తంలో పసుపు సాగు చేస్తున్నామని, పంట చేతికి వచ్చాక మద్దతు ధర ఉంటుందో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు.


