కత్తులతో బెదిరించి.. మోకాళ్లపై కూర్చోబెట్టి.. | - | Sakshi
Sakshi News home page

కత్తులతో బెదిరించి.. మోకాళ్లపై కూర్చోబెట్టి..

Jun 29 2026 7:21 AM | Updated on Jun 29 2026 7:21 AM

చిలకలగూడ: ముసుగులు ధరించిన దుండగులు సెక్యూరిటీగార్డులను కత్తులతో బెదిరించి మోకాళ్లపై కూర్చోబెట్టారు. గ్యాస్‌ కట్టర్‌తో తలుపులు తెరచి నగదు అపహరించి పరారయ్యారు. ఈ ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో జరిగింది. చిలకలగూడ ఏసీపీ శశాంక్‌రెడ్డి, డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ మధుబాబు తెలిపిన మేరకు.. పంజాగుట్టకు చెందిన సతీష్‌కుమార్‌ పద్మారావునగర్‌లో నాలుగు అంతస్తుల భవనంలో జ్యోతి మెడికల్‌ హాల్‌ పేరిట హోల్‌సేల్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. రాత్రి సమయంలో అక్కడ ఇద్దరు సెక్యూరిటీగార్డులు కాపలాగా ఉంటున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3.20 గంటల సమయంలో ముసుగులు ధరించిన ఎనిమిది మంది వచ్చారు. సెక్యూరిటీగార్డులను కత్తులతో బెదిరించి, సెల్‌ఫోన్లు లాక్కొని.. మెట్లపై మోకాళ్లపై కూర్చోబెట్టారు. గ్యాస్‌ సిలిండర్‌, కట్టర్‌తో గదుల తలుపులు తెరిచారు. నాలుగో అంతస్తులో ఉన్న క్యాష్‌కౌంటర్‌ తాళాలు బద్దలు కొట్టి రూ. 27,500 నగదు అపహరించారు. సుమారు గంట పాటు కలయతిరిగినా ఏమీ దొరకలేదు. తిరిగి వెళుతూ సెక్యూరిటీ గార్డుల వద్ద ఉన్న రూ.2,500 నగదు కూడా లాక్కున్నారు. ఎవరికై నా చెబితే చంపేస్తామంటూ బెదిరించి క్షణాల్లో పరారయ్యారు. విషయం తెలిలసిన వెంటనే డీసీపీ రక్షితకృష్ణమూర్తి ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. యజమాని సతీష్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. నేరస్తులను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని ఏసీపీ శశాంక్‌రెడ్డి తెలిపారు.

పద్మారావునగర్‌ జ్యోతి మెడికల్‌ హాలులో దోపిడీ

గ్యాస్‌కట్టర్‌తో తలుపులు తెరిచి చోరీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement