తాండూరు రూరల్: పెద్దేముల్ మండల కేంద్రంలో రాంప్రసాద్‌పై దాడి చేసిన ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ప్రశాంత్ వర్దన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పెద్దేముల్‌కు చెందిన కాంగ్రెస్ మహిళా నేత శోభారాణి వద్ద రాంప్రసాద్ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. వ్యక్తిగత కక్షల నేపథ్యంలో రాంప్రసాద్‌ను శోభారాణి కుమారుడు వీరేశం అతడి స్నేహితులు శుక్రవారం రాత్రి విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో రాంప్రసాద్ తల్లి సంగమ్మ పెద్దేముల్ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు శోభారాణి, వీరేశం అతడి స్నేహితులు మహేందర్, రవిపై కేసు నమోదు చేసినట్ల ఎస్‌ఐ తెలిపారు.
శోభారాణి అరెస్ట్‌కు డిమాండ్
రాంప్రసాద్‌పై దాడికి పాల్పడిన కాంగ్రెస్ నేత శోభారాణిని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రజా సంఘాల నాయకులు, ముదిరాజ్ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం బాధితుడిని, తల్లి సంగమ్మను పరామర్శించారు. అనంతరం ఎస్‌ఐ ప్రశాంత్‌వర్ధన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వాహాబ్, పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు వీరప్ప, సంఘం నాయకులు మల్లేశం ,శ్రీనివాస్, నారాయణ, నర్సింలు పాల్గొన్నారు.


