నీటి సంపులో పడి చిన్నారి మృతి | - | Sakshi
Sakshi News home page

నీటి సంపులో పడి చిన్నారి మృతి

May 11 2026 9:49 AM | Updated on May 11 2026 9:49 AM

నీటి సంపులో పడి చిన్నారి మృతి ప్రేమ పేరుతో బాలిక కిడ్నాప్‌

శంకర్‌పల్లి: అప్పటిదాక అందరితో ఆడుతూ అల్లరి చేసిన చిన్నారిని అనుకోని ప్రమాదం వెంటాడింది. ఇంటి ఆవరణలో ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందింది. ఈ విషాద సంఘటన ఆదివారం మోకిల ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. జన్వాడకు చెందిన కాట్నే శేఖర్‌, మేఘన దంపతులకు ఒక కుమారుడు, కూతురు ప్రియాన్షు(3) ఉన్నారు. శేఖర్‌ ప్రైవేటు ఉద్యోగి. ఉదయం శేఖర్‌ వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లగా.. తల్లి ఇంట్లో పనులు చేస్తుంది. ఈ క్రమంలో ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న ప్రియాన్షు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడింది. కాసేపటికి చిన్నారి ఎక్కడ అని వెతికిన తల్లికి.. చివరికి సంపులో తేలియాడుతూ విగతజీవిగా కనిపించింది. చిన్నారి మృతి చెందడంతో కుటుంబం, గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

ఢిల్లీకి చెందిన వ్యక్తి అరెస్టు

తాండూరు టౌన్‌: ప్రేమ పేరుతో బాలికను ట్రాప్‌ చేసి ఢిల్లీ ఎత్తుకెళ్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటన తాండూరు టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. పట్టణ సీఐ పరమేశ్వర్‌ తెలిపిన ప్రకారం.. ఢిల్లీకి చెందిన ఆదీమ్‌(28) ఆరె నెలల క్రితం బతుకు దెరువు నిమిత్తం తాండూరుకు వచ్చాడు. స్థానిక రైల్వే స్టేషన్‌ సమీపంలోని ఢిల్లీ సెలూన్‌లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఓ బాలిక(16)కు ప్రేమిస్తున్నానంటూ మాయ మాటలు చెప్పాడు. శనివారం ఎవరికీ తెలియకుండా బాలికను తీసుకుని ఢిల్లీకి పారిపోయేందుకు యత్నించాడు. బాలిక కనపడక పోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆదీమ్‌పై కిడ్నాప్‌ కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement