లోడు ఓవర్‌.. ఒత్తిడిలో ఫీడర్‌! | - | Sakshi
Sakshi News home page

లోడు ఓవర్‌.. ఒత్తిడిలో ఫీడర్‌!

Apr 24 2026 8:14 AM | Updated on Apr 24 2026 8:14 AM

ఓవర్‌లోడుతో కాలిపోయిన డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు

సాక్షి, రంగారెడ్డిజిల్లా: విద్యుత్‌ డిమాండ్‌ అంతకంతకూ పెరుగుతోంది. వృద్ధిరేటు సాధారణంగా ఏటా 10 నుంచి 12 శాతం నమోదవుతుండగా ఈసారి ఏకంగా 30 శాతం మించిపోయింది. తొమ్మిది సర్కిళ్ల పరిధిలోని 80 శాతం 132 కేవీ సబ్‌స్టేషన్లు ఓవర్‌ లోడుతో హీటెక్కిపోతున్నాయి. భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్లు డీటీఆర్‌ల సామర్థ్యాన్ని పెంచకపోవడం, లోడ్‌ బ్యాలెన్స్‌ చేయకపోవడం, ఆయిల్‌ లీకేజీలను అరికట్టకపోవడం, ఎప్పటికప్పుడు టంగ్‌టెస్టర్‌తో లోడును పరిశీలించకపోవడం, వినియోగం అనూహ్యంగా పెరుగుతుండటంతో డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోతున్నాయి. సైబర్‌సిటీ, రాజేంద్రనగర్‌ సర్కిళ్లలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. కేవలం 22 రోజుల్లో 800కుపైగా డీటీఆర్‌లు కాలిపోయాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఫీడర్లు ట్రిప్పవుతుండటంతో గంటల తరబడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోతోంది. విధిలేని పరిస్థితుల్లో ఇంజనీర్లు అనధికారిక ఎల్‌ఆర్‌ (లోడ్‌ రిలీఫ్‌)లను అమలు చేస్తున్నారు. సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య ఈ సమస్య ఎక్కువగా ఉంది.

100 కేవీ డీటీఆర్‌పై 130 యాంప్స్‌ లోడు

గ్రేటర్‌లో 65 లక్షలకుపైగా విద్యుత్‌ కనెక్ష ఉండగా, వీటిలో 55 లక్షల గృహ, 8 లక్షల వాణిజ్య, 50 వేలకుపైగా పారిశ్రామిక కనెక్షన్లు ఉన్నాయి. సమ్మర్‌ యాక్షన్‌ప్లాన్‌లో భాగంగా ఫిబ్రవరికి ముందే మెజార్టీ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లను, డీటీఆర్‌లను మార్చారు. అయినా అంచనాలకు మించి విద్యుత్‌ వినియోగం అవుతోంది. 2024 మే 29న అత్యధికంగా 91.69 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ నమోదైంది. తర్వాత డిస్కం చరిత్రలోనే తొలిసారిగా 2026 ఏప్రిల్‌ 17న 100.56 మిలియన్‌ యూనిట్లు దాటింది. సైబరాబాద్‌, రాజేంద్రనగర్‌ సర్కిళ్లలోని పలు 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లపై 130 యాంప్స్‌కు మించి లోడు పడుతోంది. ఇప్పటికే 20 నుంచి 25 సబ్‌స్టేషన్లు డేంజర్‌జోన్‌లో ఉన్నట్లు తెలిసింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎల్‌ఆర్‌లు తప్పవనే హెచ్చరికలు లేకపోలేదు. భవిష్యత్తు డిమాండ్‌కు తగ్గట్లుగా కొత్త సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలని డిస్కం నిర్ణయించింది. అయితే మెజార్టీ సబ్‌స్టేషన్లు టెండర్‌ దశ దాటలేదు.

చినుకు చిటపట.. ఇన్సులేటర్లు టపటపా

పగటి ఉష్ణోగ్రతలకు ఫీడర్లు, డీటీఆర్‌లు, విద్యుత్‌ స్తంభాలపై ఉన్న ఇన్సులేటర్లు హీటెక్కిపోతున్నాయి. పగుళ్ల మధ్య వర్షపు చినుకులు పడితే.. టప్‌మంటూ భారీ శబ్దంతో పేలిపోతున్నాయి. ఇంటిముందు కరెంట్‌ స్తంభంపై భారీ శబ్దాలు వస్తుండటం, షార్ట్‌సర్క్యూట్‌లు వెలుగు చూస్తుండటం, అగ్నికీలలు ఎగిరి ఆయిల్‌ లీకేజీలున్న డీటీఆర్‌లపై పడుతుండటం, వాటి నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇలా ప్రతి రోజూ 50 నుంచి 60 డీటీఆర్‌లు కాలిపోతున్నట్లు డిస్కం లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. పాడైన డీటీఆర్‌ను గుర్తించి, దాని స్థానంలో కొత్తది అమర్చేందుకు ఆరేడు గంటల సమయం పడుతోంది. రాత్రిపూట ఉక్కపోతకు తోడు ఇంట్లో కరెంట్‌ కూడా లేకపోవడంతో దోమలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఫోన్లు చేసినా క్షేత్రస్థాయి సిబ్బంది స్పందించడం లేదు. 1912 కాల్‌ సెంటర్‌ సైతం బిజీగా ఉంటోంది. విధి లేని పరిస్థితుల్లో ఎక్స్‌ వేదికగా ఫిర్యా దులను షేర్‌ చేయాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు.

తేదీ పేలిన డీటీఆర్‌లు 22 52 21 72 20 72 19 62 18 54

గణనీయంగా విద్యుత్‌ డిమాండ్‌

హీటెక్కిపోతున్న సబ్‌స్టేషన్లు

పేలిపోతున్న డీటీఆర్‌లు

చేతులెత్తేసిన ట్రాన్స్‌కో

అనధికారిక లోడ్‌ రిలీఫ్‌లు షురూ

Advertisement
 
Advertisement
Advertisement