1 నుంచి ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు | - | Sakshi
Sakshi News home page

1 నుంచి ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు

Apr 24 2026 8:14 AM | Updated on Apr 24 2026 8:14 AM

1 నుంచి ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు ఆమనగల్లుకు ఐదు పడకల డయాలసిస్‌ సెంటర్‌ ఆర్టీసీ కార్మికులకు మద్దతు కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక వాయిదా

హుడాకాంప్లెక్స్‌: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో మే 1 నుంచి 31వ తేదీ వరకు ఉచిత వేసవి శిక్షణ శిబారాలు నిర్వహించనున్నట్టు జిల్లా యువజన, క్రీడల అధికారి స్వర్ణలత గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 14 సంవత్సరాల లోపు బాలబాలికలు వీటిని వినియోగించుకోవాలని కోరారు. శిబిరాలను నిర్వహించేందుకు అనుభవజ్ఞులైన సీనియర్‌ క్రీడాకారులు, జాతీయ స్థాయి క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఫిజికల్‌ డైరెక్టర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు తాము నిర్వహించదలిచిన క్రీడా విభాగం, క్రీడా ప్రాంగణం వివరాలతో ఈనెల 25వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఆమనగల్లు: పట్టణానికి ఐదు పడకల డయాలసిస్‌ సెంటర్‌ మంజూరైనట్లు జిల్లా వైద్యాధికారి డా.లలితా దేవి తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి ఆవరణలో నూతనంగా రూ.17.5 కోట్లతో నిర్మిస్తున్న భవనాన్ని గురువారం మహేశ్వరం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా.నాగేందర్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డయాలసిస్‌ సమస్యలతో బాధపడేవారికి అనుకూలంగా నూతన భవనంలో ఐదు పడకల సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో ఆమనగల్లు సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ నాగరాజు, వైద్యాధికారి డా.మైమునాబేగం, హెచ్‌ఈఓ తిరుపతిరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం: ఆర్టీసీ కార్మికుల న్యాయమైన పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి యాదయ్య తెలిపారు. ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో వద్దకు గురువారం వచ్చిన ఆయన కార్మికుల సమ్మెకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. తక్షణమే కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకుడు కాటం రాజుగౌడ్‌, ఆర్టీసీ జేఏసీ నాయకులు యాదగిరి, శ్రీహరి, నర్సింహ, పరమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆమనగల్లు: పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించిన కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక ప్రత్యేక సమావేశం కోరం లేకపోవడంతో వాయిదా పడింది. మున్సిపాలిటీలో నాలుగు కో ఆప్షన్‌ పదవుల కోసం నిర్వహించిన సమావేశానికి బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌లు పాపిశెట్టి రాము, ఆంజనేయులుయాదవ్‌, నాగిళ్ల జగన్‌, రమేశ్‌, అనూష, భాగ్యలక్ష్మి, యశోదమ్మ హాజరయ్యారు. చైర్మన్‌ పత్యానాయక్‌, వైస్‌ చైర్మన్‌ తల్లోజు గీత, బీజేపీ, కాంగ్రెస్‌ కౌన్సిలర్‌లు గైర్హాజరయ్యారు. సమావేశం నిర్వహణకు కనీసం 8 మంది సభ్యులు హాజరు కావాల్సి ఉండగా బీఆర్‌ఎస్‌కు చెందిన ఏడుగురు మాత్రమే హాజరు కావడంతో కోరం లేని కారణంగా వాయిదా వేస్తున్నట్లు కమిషనర్‌ శంకర్‌ నాయక్‌ ప్రకటించారు. బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌లు మాత్రం ఎన్నిక నిర్వహించాలని వాగ్వాదానికి దిగారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి ధర్నా చేశారు. ఈనెల 27న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని కమిషనర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement