షాద్‌నగర్: నియోజకవర్గంలోని ఫరూఖ్‌నగర్‌లో రెండు మూడు గ్రామాల్లో తప్ప అన్ని గ్రామాల్లో బెల్టు షాపులున్నాయి. సుమారు రెండు వందలకు పైగా దుకాణాలు వెలిశాయి. కేశంపేటలో 28 గ్రామాలు ఉంటే అందులో ఒక్కో గ్రామంలో సుమారు ఆరు నుంచి ఏడు బెల్టు షాపులు ఉన్నాయి. దుకాణాదారులు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారు.
కొత్తూరు.. ‘బెల్టు’ జోరు
మండలంలోని ఇన్ముల్‌నర్వ, సిద్ధాపూర్, గూడూరు, తీగాపూర్‌తో పాటు పలు గ్రామాల్లో బెల్టు దుకాణాలు జోరుగా సాగుతున్నాయి. బయట మాత్రం కూల్‌డ్రింక్స్ సీసాలను పెట్టి లోపల మద్యం బాటిళ్లను ఉంచుతున్నారు. చీప్ లిక్కర్ మొదలుకొని బ్రాండెడ్ మద్యం వరకు లభిస్తోంది. కొందరు నిర్వాహకులు ఫోన్ చేస్తే చాలు ఎక్కడికై నా మద్యం, తిను బండారాలు సరఫరా చేస్తున్నారు. దీంతో గ్రామాల్లో యువకులు మద్యానికి బానిసలుగా మారుతున్నారు. ఇటీవల టెండర్లలో మద్యం దుకాణాలను దక్కించుకున్న కొందరు వ్యాపారులు అమ్మకాలను పెంచుకోవడానికి బెల్టు దుకాణాలను ప్రోత్సహిస్తున్నారు. నిత్యం పట్టణంలోని పలు దుకాణాల నుంచి బెల్టు షాపులకు ఆటోలు, ద్విచక్ర వాహనాలపై మద్యం తరులుతోంది.
కొందుర్గులో ..
కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండలాల్లో బెల్ట్‌షాపుల వ్యాపారం జోరుగా సాగుతోంది. కొందుర్గు మండలంలోని 22 పంచాయతీలకు గాను కొందుర్గు, బైరంపల్లి, అయోధ్యాపూర్‌తండా, చిన్నఎల్కిచర్ల, పర్వతాపూర్, చెర్కుపల్లి, విశ్వనాథ్‌పూర్ గ్రామాల్లో, జిల్లేడ్ చౌదరిగూడ మండలం తుమ్మలపల్లిలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. మిగతా గ్రామాల్లో సమయం సందర్భం లేకుండా ఎనీ టైం మద్యం లభిస్తోంది.
కిరాణా దుకాణంలో మద్యం సీసాలు


