దోపిడీ కేసులో ఒకరి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

దోపిడీ కేసులో ఒకరి అరెస్టు

Apr 24 2026 8:14 AM | Updated on Apr 24 2026 8:14 AM

కందుకూరు: బ్యాంకు నుంచి నగదు తీసుకెళ్తున్న వ్యక్తి నుంచి చాకచక్యంగా దొంగలు దోచుకెళ్లిన ఘటనలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి రూ.8 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన కందుకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. మండల పరిధిలోని అన్నోజిగూడకు చెందిన ఢిల్లీ నారాయణ ఈ నెల 16న మధ్యాహ్నం కందుకూరు ఎస్‌బీఐకు వచ్చి రూ.10 లక్షల నగదు తీసుకుని బైక్‌ డిక్కీలో పెట్టుకుని ఇంటికి బయలుదేరాడు. విషయాన్ని గమనించిన నలుగురు దొంగలు అతన్ని బైక్‌లపై అనుసరించారు. కందుకూరు గ్రామం దాటిన తర్వాత నారాయణను ఆపి అడ్రస్‌ అడుగుతున్నట్లుగా నటించారు. వెనుక మరో బైక్‌పై వచ్చిన మరో ఇద్దరు చాకచక్యంగా డిక్కీ తెరిచి నగదు తస్కరించారు. ఇంటికి వెళ్లి చూసుకున్న బాధితుడు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ టీవీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా గోకవరం గ్రామంసంజీవయ్యనగర్‌కు చెందిన మేకల నాని, నితిన్‌, అనిల్‌, సాయిలుగా గుర్తించారు. అంతా గ్రూప్‌గా ఏర్పడి తరచూ దొంగతనాలకు పాల్పడుతుంటారు. వీరిలో నితిన్‌ హైదరాబాద్‌ అల్మాస్‌గూడ, రాజీవ్‌ గృహకల్పలో గది అద్దెకు తీసుకుని నివసిస్తున్నాడు. అంతా ఆ గదిలోనే ఉండి చోరీలు చేసి మళ్లీ వారి స్వగ్రామానికి వెళ్లేవారు. గురువారం పోలీసులు నితిన్‌ గదికి వెళ్లగా మేకల నాని దొరికాడు. అతని నుంచి రూ.8 లక్షల నగదు, బైక్‌, సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. అతన్ని అరెస్టు చేసి విచారణ చేపట్టారు. మిగతా వారిని త్వరలో పట్టుకుంటామని సీఐ తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement