పుర పోరు.. హడావుడి షురూ! | - | Sakshi
Sakshi News home page

పుర పోరు.. హడావుడి షురూ!

Jan 28 2026 9:59 AM | Updated on Jan 28 2026 9:59 AM

పుర పోరు.. హడావుడి షురూ!

పుర పోరు.. హడావుడి షురూ!

పట్టణాల్లో వేడెక్కిన రాజకీయం

పోటీకి సిద్ధమైన ఆశావహులు

వార్డుల్లో ప్రచారం మొదలు

టికెట్ల కోసం తీవ్ర కసరత్తు

పట్టణాల్లో ఓట్ల పండగ షురూ అయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటనతో ఒక్కసారిగా రాజకీయ రంగు పులుముకుంది. పురపాలక సంఘాల్లో పాగా వేసేందుకు అధికార కాంగ్రెస్‌, విపక్షాలు బీఆర్‌ఎస్‌, బీజేపీ తీవ్రంగా తలపడుతున్నాయి. ఆశావహులు ఆయా పార్టీల టికెట్ల కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.

మొయినాబాద్‌: మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో రాజకీయం వేడెక్కింది. ఆశావహులంతా పోటీకి సిద్ధమయ్యారు. బుధవారం నుంచి నామినేషన్ల పర్వం మొదలవుతుండడంతో ప్రధాన రాజకీయ పార్టీల టికెట్ల కోసం గట్టి పోటీ నెలకొంది. ఏయే వార్డుల్లో ఎవరు పోటీ చేస్తున్నారనే విషయంలో పార్టీలు ఓ అంచనాకు వచ్చాయి. బలమైన నాయకులకే టికెట్లు ఇవ్వాలని ఆయా ప్రధాన పార్టీలు భావిస్తుండడంతో.. పార్టీ టికెట్లు దక్కవనుకున్న ఆశావహులు ఇప్పటికే కండువాలు మార్చేశారు. ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధ మైన నాయకులు ప్రచారాలు సైతం మొదలు పెట్టా రు. వార్డుల్లో తిరిగి ప్రజలను కలిసి తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.

మారుతున్న కండువాలు

మొయినాబాద్‌ మున్సిపాలిటీలో 26 వార్డులు ఉన్నాయి. ఈ నెల 17న రిజర్వేషన్లు ఖరారు కావడంతో రిజర్వేషన్లు కలిసి వచ్చిన ఆశావహులంతా ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. రిజర్వేషన్లు కలిసిరానివారు పక్క వార్డుల్లో పోటీ చేసే ప్రయత్నాలు చేస్తుండగా కొందరు తమ సతులను పోటీలో దింపేందుకు శ్రీకారం చుడుతున్నారు. పార్టీ టికెట్లు రావని భావించిన నాయకులు కొందరు ఇప్పటికే కండువాలు మార్చారు. కొన్ని చోట్ల కాంగ్రెస్‌ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరితే.. మరికొన్ని చోట్ల బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో, బీజేపీలో చేరారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో జంపింగ్‌లు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.

ముగ్గురి గురి

మున్సిపల్‌ చైర్మన్‌ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వు కావడంతో ఆ కేటగిరికి చెందిన ప్రధాన పార్టీల నాయకులు దానిపై గురిపెట్టారు. కాంగ్రెస్‌ పార్టీలో చైర్మన్‌ పదవిపై ఇద్దరు నాయకులు కన్నేశారు. ఓ నాయకుడు ఓ స్థానంలో తాను పోటీ చేస్తూ మరో స్థానంలో తన భార్యను బరిలోకి దింపేందుకు పావు లు కదుపుతున్నారు. ఇక బీఆర్‌ఎస్‌ పార్టీలోనూ చైర్మ న్‌ పదవి కోసం తీవ్ర పోటీనే ఉంది. ముగ్గురు ఎస్సీ నాయకులు చైర్మన్‌ పదవిని ఆశిస్తున్నారు. అయితే ముందుగా కౌన్సిలర్‌లుగా గెలిచిన తరువాత చైర్మన్‌ స్థానం ఎవరికనేది తేలుద్దాం అంటూ పార్టీ అధి ష్టానం ఆశావహులకు సూచించినట్లు తెలిసింది. మరో వైపు బీజేపీ సైతం చైర్మన్‌ స్థానంపై కన్నేసింది. పూర్తి మెజార్టీ రాకపోయినా చైర్మన్‌ ఎన్నికలో కీలకంగా మారుతామనే ఆశాభావంతో ముందుకెళ్తోంది.

ఇంటింటికీ తిరుగుతూ..

మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన నాయకులంతా వార్డుల్లో ప్రచారాలు మొదలు పెట్టారు. ఇంటింటికి తిరిగి తాము ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని.. తమను గెలిపించాలని ఓటర్లకు చెబుతూ అభ్యర్థిస్తున్నారు. పార్టీ టికెట్లు తమకే వస్థాయని భావిస్తున్న నాయకులంతా జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రధాన పార్టీల టికెట్ల విషయంలో గట్టి పోటీ నెలకొంది. కాంగ్రెస్‌ పార్టీలో రెండు వర్గాలు ఉండటంతో ఏ వర్గానికి టికెట్లు దక్కుతాయోనని పార్టీ వర్గాలే అయోమయానికి గురవుతున్నాయి. మరోవైపు బీఆర్‌ఎస్‌లోనూ టికెట్ల కోసం గట్టి పోటీ కొనసాగుతుంది.

నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో నామినేషన్ల స్వీకరణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొయినాబాద్‌ మున్సిపాలిటీలోని 26 వార్డులకు సంబంధించిన నామినేషన్లను మున్సిపల్‌ కేంద్రంలోని మెథడిస్ట్‌ స్కూల్‌లో స్వీకరించనున్నారు. ఈ ప్రక్రియకు 9 మంది ఆర్‌ఓలను కేటాయించారు. ఒక్కో ఆర్‌ఓ అధికారి మూడు వార్డులకు సంబంధించిన నామినేషన్లను స్వీకరిస్తారు. బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ జాకీర్‌ అహ్మద్‌ తెలిపారు. ఈ నెల 30న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement