అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్ల ఆటకట్టు
నాగోలు: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్తులను మంగళవారం చైతన్యపురి పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 11 తులాల బంగారు అభరణాలు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించారు. మంగళవారం ఎల్‌బీనగర్ డీసీపీ డాక్టర్ అనురాధ వివరాలు వెల్లడించారు..న్యూఢిల్లీ, సాగర్‌పూర్‌కు చెందిన అక్షయ్ కుమార్ శర్మ, , గురుగావ్‌కు చెందిన రోహిత్ డెలివరీ బాయ్‌లుగా పని చేసేవారు. సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్న వీరు ఢిల్లీతో పాటు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పలు చోరీలకు పాల్పడ్డారు. వీరిద్దరిపై 2017 నుండి 2019 వరకు ఢిల్లీలోని వివిధ పోలీస్ స్టేషన్‌లో 10 కేసులు నమోదయ్యాయి. నాగ్‌పూర్‌లోనూ రెండు కేసులు నమోదు కావడంతో గత జూలైలో నాగ్‌పూర్ వారిని అరెస్టు చేసిన పోలీసులు జైలుకు పంపారు. జైలు నుండి విడుదలైన తర్వాత వీరు ఈనెల 17న హైదరాబాద్‌కు మకాం మార్చారు. సికింద్రాబాద్, గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హాస్టల్ ముందు పార్కింగ్ చేసిన బైక్‌ను చోరీ చేశారు. అనంతరం ఇద్దరు కలిసి బైక్ తిరుగుతూ నాచారం, జవహర్‌నగర్, షామీర్‌పేట్, హయత్‌నగర్, నాగోలు, చైతన్యపురి పోలీస్ స్టేషన్ల్ పరిధిలో ఏడు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. అనంతరం సికింద్రాబాద్‌లోని సంగీత థియేటర్ వద్ద చోరీ చేసిన బైక్‌ను వదిలేసి ఢిల్లీకి పారిపోయారు. వరుస చైన్ స్నాచింగ్‌లతో అప్రమత్తమైన పోలీసులు ఎల్‌బీనగర్ అడిషనల్ డీసీపీ కోటేశ్వరావు, ఏసీపీ కృష్ణయ్య పర్యవేక్షణలో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలతో నిందితులు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. చైతన్యపురి డీఐ గురుస్వామి నేతృత్వంలో ఢిల్లీ వెళ్లిన ప్రత్యేక బృందం నిందితులను అరెస్టు చేసి వారి నుండి 11 తులాల బంగారు అభరాలు, రెండు మొబైల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతి తక్కువ సమయంలో కేసును చేధించిన చైనత్యపురి పోలీస్‌లను డీసీపీ అభినందించి రివార్టులను అందజేశారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ కోటేశ్వరావు, ఏసీపీ కృష్ణయ్య, చైతన్యపురి సీఐ సైదులు, డీఐ గురుస్వామి, ఎస్‌ఐలు రమేష్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
నగరంలో వరుస చైన్ స్నాచింగ్‌లు
ఇద్దరు పాత నేరస్తుల అరెస్టు
11 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
నిందితులపై పలు రాష్ట్రాల్లో
పదుల సంఖ్యలో కేసులు
అంతర్రాష్ట్ర చైన్ స్నాచర్ల ఆటకట్టు


