అప్పులు తీర్చేందుకు చోరీల బాట
ఏటీఎం లూటీకి యత్నించిన దొంగల అరెస్టు
షాద్‌నగర్ రూరల్: అప్పులు తీర్చేందుకు ఏటీఎం చోరీకి యత్నించిన దుండగులను పోలీసులు అరెస్టు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు వివరాలను పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ లక్ష్మీనారాయణ వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం గుల్బార్గా జిల్లాకు చెందిన మనపడి రామకృష్ణ, మహారాష్ట్ర సోలాపూర్ చెందిన రాహుల్ సౌరప్ప, వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం మాధారం గ్రామానికి చెందిన ఎరుకలి బన్నప్ప, అదే మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఎరుకలి రాజు బంధువులు. వీరందరూ హైదరాబాద్‌కు వచ్చి ఆటో నడుపుకొంటూ జీవిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేక గ్రామంలో తల్లిదండ్రులు చేసిన అప్పులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎలాగైనా సులభంగా డబ్బు సంపాదించి అప్పులు కట్టాలనే ఆలోచనతో పథకం పన్నారు. ఏటీఎంలలో ఎక్కువ డబ్బులు ఉంటాయనే భావనతో ఈ నెల 18న హైదరాబాద్ నుంచి మొయినాబాద్‌కు ఆటోలో జిల్లేడ్ చౌదరిగూడ మండల పరిధిలోని లాల్‌పహాడ్‌కు చేరుకున్నారు. అక్కడ అర్ధరాత్రి ఏటీఎం సెంటర్‌లోకి వెళ్లి సుత్తెతో మెషిన్ పగులగొట్టి డబ్బులు దొంగిలించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పెద్ద శబ్దం కావడంతో ఎవరో వస్తున్నట్లు కదలికలు గమనించారు. దీంతో దొరికిపోతామనే భయంతో పరారయ్యారు. దీనిపై ఈ నెల 19న ఏటీఎం నిర్వాహకుడు సంతోష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి నిందితులను గుర్తించి పట్టుకున్నారు. చోరీకి ఉపయోగించిన ఆటో, రెండు సెల్‌ఫోన్‌లు, రెండు సుత్తెలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.


