లైంగిక దాడి కేసులో నిందితుడికి పదేళ్ల జైలు | - | Sakshi
Sakshi News home page

లైంగిక దాడి కేసులో నిందితుడికి పదేళ్ల జైలు

Jan 28 2026 9:59 AM | Updated on Jan 28 2026 9:59 AM

లైంగిక దాడి కేసులో నిందితుడికి పదేళ్ల జైలు

లైంగిక దాడి కేసులో నిందితుడికి పదేళ్ల జైలు

సాక్షి, సిటీబ్యూరో: లైంగికదాడి కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయస్థానం మంగళవారం తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే.. తన కుమార్తెతో పరిచయం ఏర్పరుచుకున్న యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమైపె లైంగిక దాడికి పాల్పడ్డాడని.. ఆ తర్వాత ఆమెతో గొడవపడి వివాహానికి నిరాకరించాడని బాధితురాలి తల్లి 2017 ఫిబ్రవరిలో బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో మనస్తాపానికి లోనైన తన కుమార్తె భవనం మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్వాప్తు చేపట్టిన పోలీసులు 2017 ఫిబ్రవరి 12 న నిందితుడిని అరెస్టు చేసి జ్యూడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు. కేసుపై విచారణ చేపట్టిన మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లా 1వ అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి తిరుపతి నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పారు.

మల్లేపల్లిలో అగ్ని ప్రమాదం

రూ.50 లక్షల ఆస్తినష్టం

నాంపల్లి: మల్లేపల్లిలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా దగ్ధం కాగా, మరో రెండు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. ఈ సంఘటన నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మల్లేపల్లి ఐటీఐ సమీపంలో కార్ల రిపేరింగ్‌ షెడ్‌ కొనసాగుతోంది. సోమవారం రాత్రి గ్రిడ్‌లోని ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద నిప్పురవ్వలు ఎగిసి పడటంతో పక్కన ఉన్న షెడ్‌కు మంటలు వ్యాపించాయి. దీంతో షెడ్‌లో ఉన్న కార్లు కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో సుమారు రూ.50 లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్లు పోలీసులు తెలిపారు.

నమ్మించి నట్టేట ముంచారు!

నకిలీ ట్రేడింగ్‌ యాప్‌ ద్వారా టోకరా

నగరవాసి నుంచి రూ.45 లక్షలు స్వాహా

కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: సోషల్‌మీడియా ద్వారా ఇన్వెస్ట్‌మెంట్స్‌ పేరుతో నగరవాసికి ఎర వేసిన సైబర్‌ నేరగాళ్లు వర్చువల్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయించి నిండా ముంచారు. వాలెట్‌లో రూ.6.19 కోట్ల బ్యాలెన్స్‌ చూపిస్తూ... రూ.45.01 లక్షలు స్వాహా చేశారు. బాధితుడి ఫిర్యాదుతో మంగళవారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నల్లకుంట ప్రాంతానికి చెందిన వ్యక్తి (52) ఫేస్‌బుక్‌లో ‘ఇన్వెస్టిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో వచ్చిన ప్రకటన చూసి ఆకర్షితుడయ్యాడు. అందులో ఉన్న లింక్‌ క్లిక్‌ చేయడంతోనే బాధితుడిని సైబర్‌ నేరగాళ్లు ‘స్టడీ సర్కిల్‌’ పేరుతో ఉన్న వాట్సాప్‌ గ్రూప్‌లో చేర్చారు. ఆ గ్రూప్‌లో ఉన్న ఇతర సభ్యులు అంతా ట్రేడింగ్‌పై శిక్షణతో పాటు సూచనలు, సలహాలు ఇస్తామని, తాము లాభాలు పొందుతున్నామని పోస్టులు చేసి అతడిని నమ్మించారు. వారి సూచనల మేరకు బాధితుడు లింక్‌ ద్వారా వచ్చిన ఈ వర్చువల్‌ ట్రేడింగ్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్నారు. తొలుత రూ.50 వేలు ఆ యాప్‌లోకి బదిలీ చేయడంతో ఆ బ్యాలెన్స్‌ వాలెట్‌లో కనిపించింది. ఆపై మరింత మొత్తం పెట్టుబడి పెట్టాలని గ్రూపు సభ్యులు ఒత్తిడి చేశారు. ఓ దశలో ప్రొఫెసర్‌ ముకుల్‌ కొచ్చర్‌, అతడి సహాయకుడిగా కొందరు పరిచయం చేసుకున్నారు. ఇన్వెస్ట్‌మెంట్స్‌లో సలహాలు ఇస్తామంటూ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, గ్లోబల్‌ ఓషన్‌ లాజిస్టిక్స్‌ ఐపీఓ షేర్లు ఉచితంగా అధిక సబ్‌స్క్రిప్షన్‌ కోటాలో బాధితుడికి కేటాయించినట్లు చెప్పారు. పెట్టుబడి, లాభాలు, ఈ షేర్లతో కలిపి బాధితుడి వర్చువల్‌ ఖాతాలో మొత్తం రూ.6,19,49,304 బ్యాలెన్స్‌ చూపించారు. ఆ మొత్తం విత్‌డ్రా చేసుకోవాలంటే మరికొంత చెల్లించాలంటూ డబ్బు బదిలీ చేయించుకున్నారు. మొత్తమ్మీద బాధితుడు రూ.45,01,017 చెల్లించినా మరికొంత డిమాండ్‌ చేశారు. దీంతో తాను మోసపోయానని గుర్తించిన అతను 1930కు ద్వారా ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement