ప్రభుత్వ జాగాల్లోపాగా!
చెరువులు, కుంటలనూ వదల్లేదు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను టార్గెట్‌గా స్థిరాస్తి మాఫియా రెచ్చిపోతోంది. వీటికి నకిలీ పత్రాలు సృష్టించి.. కొల్లగొట్టేందుకు యత్నిస్తోంది. అప్పటికే పొజిషన్‌లో ఉన్న రైతులపై తన ప్రైవేటు సైన్యంతో బలప్రదర్శనకు దిగుతోంది. బలవంతపు భూ ఆక్రమణలకు పాల్పడుతోంది. ఎక్కడో మారుమూల ప్రాం తాల్లోని భూములే కాదు.. జిల్లా పరిపాలన కేంద్రానికి కూతవేటు దూరంలోని ఖరీదైన భూములు కరిగిపోతున్నా జిల్లా రెవెన్యూ యంత్రాంగం కిమ్మనకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోని శంషాబాద్, కొత్వాల్‌గూడ, గొల్లపల్లి, ఘాన్సిమియాగూడ, బహుదూర్‌గూడ సహా మహేశ్వరం, కొంగరకుర్దు రెవెన్యూల పరిధిలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్ భూములకు నకిలీ ఓఆర్‌సీలు, పట్టాదారు పాసుపుస్తుకాలు సృష్టించి విలువైన భూములను కొల్లగొడుతున్నారు.
అటవీ భూముల్లోనూ అక్రమార్కుల తిష్ట
● కొత్వాల్‌గూడ సమీపంలోని శంషాబాద్ రెవెన్యూ సర్వే నంబర్ 626/2 అటవీ శాఖకు 176.05 ఎకరాల భూమి ఉంది. ఇక్కడ 166 ఎకరాలకు ఫెన్సింగ్ వేశారు. మరో 9.5 ఎకరాలను పశువుల మేత కోసం వదిలారు. ఈ భూములపై కన్నేసిన కబ్జాదారులు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారు. వీరికి రెవెన్యూలోని కొంత మంది అధికారులు పరోక్ష సహకారం అందిస్తుండడంతో భూమిని చదును చేసి, విక్రయించే పనిలో పడ్డారు. తీరా ఈ విషయం ఫారెస్ట్ అధికారులకు తెలిసి అడ్డుకున్నారు.
● శంషాబాద్ విమానాశ్రయం రన్‌వేకు సమీపంలోని గొల్లపల్లి, బహదూర్‌గూడ పరిధిలో రియల్ వ్యాపారుల కళ్లుపడ్డాయి. వ్యవసాయ భూములను కొనుగోలు చేసి, నాలా కన్వర్షన్ చేయించకుండానే గుంటల్లో ప్లాట్లను చేస్తున్నారు. 1996లో అప్పటి ప్రభుత్వం హిమాయత్‌సాగర్ పరిరక్షణకు 111 జీఓను తీసుకొచ్చింది. ఇళ్ల నిర్మాణానికి ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేదు. కానీ ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలు వెలిశాయి. అసైన్డ్ భూములు వెంచర్లుగా మారాయి.
● శంషాబాద్ మండలం ఘాన్సిమియాగూడ సర్వే నంబర్ 3, 4లో 400 ఎకరాల ప్రభుత్వ సీలింగ్ భూములున్నాయి. వీటిని అమ్మడం, కొనడం నిషేధం. కానీ ఈ విలువైన భూములపై కన్నేసిన ముఖ్య నేత ఇప్పటికే 20 ఎకరాలను చెరబట్టారు. ఈ నిషేధిత భూముల్లో భారీ గోదాములు, ఫంక్షన్ హాళ్లు నిర్మిస్తుండటం విశేషం.
ఖాళీగా కన్పిస్తే కబ్జా
● హయత్‌నగర్–ఇంజాపూర్ రోడ్డులోని సర్వే నంబర్ 191లోని ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతోంది. ఇప్పటికే టిప్పర్ల కొద్ది మట్టిని నింపి భూమిని చదును చేసినా పట్టించుకున్న నాథుడు లేడు.
● అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మన్నెగూడ సర్వే నంబర్ 49లో 28 గుంటల ప్రభుత్వ భూమిపై ఓ స్థిరాస్తి వ్యాపారి కళ్లు పడ్డాయి. రూ.10 కోట్లకు పైగా విలువ చేసే ఈ భూమిని తన పట్టా భూమిలో కలిపి, రోడ్డు, పార్కులను ఏర్పాటు చేశారు.
● మహేశ్వరం మండల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 461లోని 128 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 19 ఎకరాలను ఓ ఎక్స్ సర్వీస్‌మెన్‌కు కేటాయించారు. మిగిలిన భూములను పేదలకు అసైన్ చేశారు. ఇక్కడ ఎకరం రూ.పది కోట్లపైనే ఉంటుంది. ఖరీదైన ఈ భూములపై ఆక్రమణదారుల కళ్లుపడ్డాయి. వీటికి తప్పుడు పట్టాదారు పత్రాలు సృష్టించి కొల్లగొట్టే ప్రయత్నంలో ఉన్నారు.
నకిలీ పత్రాలతో ఆక్రమణలు.. గుట్టుగా వెంచర్లు
111 జీఓ పరిధిలో అక్రమ నిర్మాణాలు
రెచ్చిపోతున్న స్థిరాస్తి మాఫియా
ఖరీదైన భూములు కరిగిపోతున్నా కిమ్మనని రెవెన్యూ యంత్రాంగం
ఇబ్రహీంపట్నం పట్టణ శివారు మంచాల రోడ్డులో ఉన్న బొంతపల్లికుంటపై కబ్జాదారుల కన్నుపడింది. 20.37 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కుంటకు ఎగువ నుంచి నీటిని తీసుకొచ్చే ప్రధాన కాల్వను ఇప్పటికే పూడ్చేశారు. తాజాగా నాలాను ఆక్రమించి, రాత్రిపూట మట్టిని నింపుతున్నారు. కళ్లముందే ఖరీదైన కుంట భూములు మాయమవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు.
మెయినాబాద్ మండలం నజీబ్‌నగర్ సర్వే నంబర్ 3,4లలో సింగారం చెరువు కుంట ఉంది. ఎఫ్‌టీఎల్ పరిధిలో 80 ఎకరాలు ఉంది. ఇందులో శిఖంపట్టా భూములు సైతం ఉన్నాయి. అయితే దాదాపు 819 మీటర్ల పొడవుతో ఉన్న కట్టను రియల్టర్లు ధ్వంసం చేశారు.
ఆమనగల్లు పట్టణం సురసముద్రం చెరువుకు సంబంధించిన వరదనీటి కాల్వ కబ్జాకు గురైంది. అయ్యప్పసాగర్ క్షేత్రంలోని చెరువు నుంచి కోనాపూర్ గేటు వద్ద ఉన్న మిషన్ భగీరథ పంపు, మిఠాయిపల్లి చెరువు మీదుగా వరద నీరు ఈ సురసముద్రంలోకి చేరుతుంది. ఓ రియల్టర్ కాల్వ పక్క భూములను కొనుగోలు చేసి, కాల్వలను సైతం తన పట్టా భూమిలో కలిపేశారు.


