సదుపాయాలపై చొరవ చూపాలి
అబ్దుల్లాపూర్‌మెట్: గ్రేటర్‌లోని శివారు డివిజన్లలోని కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అధికారులు చొరవ చూపాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డిరంగారెడ్డి జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. నాగోల్ సర్కిల్–11 పరిధిలోని పెద్దఅంబర్‌పేట, కుంట్లూర్ డివిజన్ల పరిధిలోని పలు కాలనీల్లో మంగళవారం ఎల్‌బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్‌తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీల సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్దఅంబర్‌పేట లక్ష్మారెడ్డిపాలెంలోని ఎస్‌ఎన్‌ఆర్ కళా కన్వెన్షన్ హాల్‌లో అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శివారు మున్సిపాలిటీలను గ్రేటర్‌లో విలీనం చేయడంతో ఇక్కడి ప్రజలు కొంత గందరగోళానికి గురయ్యారని, వారిలో అవగాహన కల్పించి, సందేహాలను నివృత్తి చేయడానికే అధికారులతో సమావేశాన్ని నిర్వహించామన్నారు. నిధులు కేటాయింపులో శివారు డివిజన్లపై చిన్న చూపు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పెద్దఅంబర్‌పేట, కుంట్లూరు డివిజన్ల అభివృద్ధికి రూ.వంద కోట్లు కేటాయించడంతో పాటు అన్ని విభాగాల అధికారులు నిత్యం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా పలు కాలనీల వాసులు తమ సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ కృష్ణకుమారి, చీఫ్ ఇంజనీర్ అశోక్‌రెడ్డి, నాగోల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్‌రెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, బాటసింగారం సహకార సంఘం మాజీ చైర్మన్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొత్తపల్లి జైపాల్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు, కాలనీవాసులు పాల్గొన్నారు.
సమీక్షా సమావేశంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి


