జినుగుర్తిలో క్రికెట్ అకాడమీ
● 25 మంది విద్యార్థులకు అవకాశం
● రంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ రమేష్
తాండూరు టౌన్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో ఉత్తమ నైపుణ్యం సాధించాలని రంగారెడ్డి జిల్లా స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ రమేష్ అన్నారు. తెలంగాణ మైనార్టీ గురుకుల సొసైటీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని క్రీడలకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో అకాడమీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా తాండూరు మండలం జినుగుర్తి మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలను క్రికెట్ శిక్షణ కేంద్రం కోసం ఎంపిక చేశారన్నారు. మంగళవారం ఉమ్మడి జిల్లాల్లోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు తాండూరు పట్టణంలో క్రికెట్ సెలక్షన్స్ నిర్వహించామన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 25 మంది విద్యార్థులను ఎంపిక చేశామన్నారు. వీరు ఏ గురుకులంలో చదువుతూ క్రికెట్‌కు ఎంపికయ్యారో అదే గురుకులంలో వారి అడ్మిషన్ కొనసాగుతుందని, కానీ క్రికెట్‌లో శిక్షణ మాత్రం జినుగుర్తి మైనార్టీ గురుకులంలో ఉంటుందన్నారు. మైనార్టీ విద్యార్థులను చదువుతో పాటు క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకే గురుకుల సొసైటీ సెక్రటరీ బి షఫీవుల్లా, స్పోర్ట్స్ ఆఫీసర్ సోమేశ్వర్ గురుకులాల్లో క్రీడా అకాడమీలను ప్రవేశ పెట్టినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో క్రీడకు ఒక్కో మైనార్టీ గురుకులాన్ని ఎంపిక చేశారన్నారు. దీనిలో భాగంగానే జినుగుర్తి ౖమైనార్టీ గురుకుల పాఠశాలలో క్రికెట్ అకాడమీ కొనసాగుతుందన్నారు. కార్యక్రమంలో రంగారెడ్డి ఆర్‌ఎల్సీ శ్రీనివాస్ రెడ్డి, తాండూరు గురుకుల ప్రిన్సిపాల్ వినోద్ ఖన్నా, కొడంగల్ కళాశాల ప్రిన్సిపాల్ రాఘవేందర్, పీడీ గోపాల్, శ్రీశైలం, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


