సహనానికి పరీక్ష!
ఇంటర్ విద్యార్థులకు అదనపు తరగతులు సాయంత్రం వరకు కాలేజీలోనే ప్రిపరేషన్ అర్ధాకలితో లోపిస్తున్న ఏకాగ్రత మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని విజ్ఞప్తి
హుడాకాంప్లెక్స్: పరీక్షల వేళ ఇంటర్ విద్యార్థులకు పస్తులు తప్పడం లేదు. ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న వారు ఉత్తమ ఫలితాలు సాధించేలా అధ్యాపకులు అదనపు తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం పొద్దుపోయే వరకు కాలేజీలోనే ఉండాల్సి వస్తోంది. ఉదయం తొమ్మిది గంటలకు ఇంట్లో టిఫిన్ చేసి, కాలేజీకి చేరుకున్న నిరుపేద విద్యార్థులు మధ్యాహ్నం లంచ్ కూడా వారే సమకూర్చుకోవాల్సి వస్తోంది. సాయంత్రం తినేందుకు స్నాక్స్ కూడా లేకపోవడంతో ఆకలితో అలమటించాల్సి వస్తోంది.
ఎవరికి వారే..
సాధారణంగా ఒకటి నుంచి పదో తరగతి వరకు ప్రభుత్వం మధ్యాహ్న భోజనం సరఫరా చేస్తోంది. టెన్త్ విద్యార్థులకు స్థానిక దాతల సాయంతో సాయంత్రం స్నాక్స్ సైతం సరఫరా చేస్తున్నారు. జి ల్లా వ్యాప్తంగా ఉన్న 17 ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల్లో చదువుతున్న సుమారు పదివేల మంది విద్యార్థులకు మాత్రం ఇవేవీ అందడం లేదు. ఉదయం,మధ్యాహ్నం, సాయంత్రం ఇలా అన్ని వేళల్లో నూ వారే ఆహారాన్ని సమకూర్చుకోవాల్సి వస్తోంది.
ఖాళీ కడుపుతో గ్యాస్ట్రిక్ సమస్యలు
ఇంట్లో తల్లిదండ్రులు వేళకు వంట చేయకపోవడంతో పలువురు విద్యార్థులు ఏమీ తినకుండా కాలేజీలకు వస్తున్నారు. ఆకలేసినప్పడు మంచినీళ్లతో కడుపు నింపుకొంటున్నారు. వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు అన్నీ సమకూర్చుతున్న ప్రభుత్వం డే స్కాలర్ విద్యార్థులను పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. వేళకు భోజనం చేయకపోవడం, గంటల తరబడి ఖాళీ కడుపుతో ఉండటంతో గ్యాస్ట్రిక్ సమస్యలు తలెత్తి.. తీరా పరీక్షల ముందు కడుపు నొప్పితో చదువుకు దూరం అవుతున్నారు.
స్నాక్స్ ఇస్తే బెటర్
కాలేజీలో 651 మంది వర కు విద్యార్థులు ఉన్నారు. పరీక్షల సమయం దగ్గరపడుతుండటంతో చదువులో వెనుకబడిన వారిని గుర్తించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. స్నాక్స్ లేకపోవడంతో సాయంత్రం 4.30 వరకే కాలేజీలో ఉంచుతున్నాం. స్నాక్స్ సమకూరిస్తే మరో గంటపాటు అదనంగా చదివించే అవకాశం ఉంది.
– అనురాధ, ప్రిన్సిపాల్,
సరూర్‌నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ
ఆకలితో చదవలేక పోతున్నాం
కాలేజీకి ఉదయం 8.30 గంటలకు బయలుదేరుతు న్నాం. ఇంటి నుంచి తీసుకొచ్చిన లంచ్‌బాక్స్ మధ్యాహ్నం వరకు పాడవుతుండడంతో తినలేక పోతున్నాం. సాయంత్రం 4.30 వరకు కాలేజీలోనే ఉండాల్సి వస్తోంది. ఆకలితో ఏకగ్రత కోల్పోయి చదవలేక పోతున్నాం. మధ్యాహ్నం, సాయంత్రం తినేందుకు ఏదైనా ఆహారం సమకూరిస్తే బాగుంటుంది.
– నందిని, ఇంటర్మీడియట్ విద్యార్థి
సహనానికి పరీక్ష!
సహనానికి పరీక్ష!


