గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య
తుర్కయంజాల్: పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి అన్నారు. తొర్రూర్ డివిజన్ పరిధి కమ్మగూడలోని తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఆదిబట్ల సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ వజ్రమ్మ, మాజీ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ కోశిక ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
మొయినాబాద్‌రూరల్: గ్రామాల్లో ప్రజలకు నీటి సమస్య రాకుండా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని మిషన్ భగీరథ జిల్లా అధికారి హారిక అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీవో వెంకటేశ్వర్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం పంచాయతీ కార్యదర్శులు, ఆయా గ్రామాల లైన్‌మెన్‌లకు తాగునీటిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేసవిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని, ఏవైనా చిన్నచిన్న సమస్యలుంటే వెంటనే పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ అధికారి వెంకటేశ్వర్‌రావు, మండల విద్యాధికారి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
మొయినాబాద్: పశువులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా పశువైద్యాధికారి ఎం.మధుసూదన్ అన్నారు. మొయినాబాద్, అమ్డాపూర్ పశువైద్య కేంద్రాలను శుక్రవారం ఆయన తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పశువులకు ఇచ్చే నట్టల నివారణ మందులు, గాలికుంటు నివారణ టీకాలుపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. వీటిపై గ్రామాల్లో ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచించారు. మండలంలో పశుపోషణ, జీవాల పెంపకానికి సంబంధించిన వివరాలను వైద్యాధికారులు అహ్మద్, దేవిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎస్‌ఓ సుధాకర్‌గౌడ్ ఉన్నారు.
షాద్‌నగర్‌రూరల్: సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ విద్యాశాఖల ఆధ్వర్యంలో నడుస్తున్న గురుకుల విద్యాలయాల్లో ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువును పొడిగించినట్టు గురుకులాల రీజనల్ కో ఆర్డినేటర్ నాగార్జునరావు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఐదో తరగతి, ఆరె నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 25 వరకు గడువు పొడిగించినట్టు చెప్పారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 22న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉంటుందన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు మీ సేవ కేంద్రాలు, అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్య


