పేదల లబ్ధికే ‘జీ రామ్‌జీ’
చేవెళ్ల: గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేదలకు మేలు చేసేందుకు, వారి ఉపాధికి ఆర్థిక భరోసా కల్పించేందుకే కేంద్రం జీ రామ్ జీ పథకాన్ని చట్టంగా చేసి మీ ముందుకు తీసుకు వస్తోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. మండలంలోని ఆలూరు పంచాయతీ వద్ద సర్పంచ్ కౌలంపేట భాగ్యమ్మశేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం పథకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం మరింత పక్కాగా 100 రోజుల పనిదినాలను 125 రోజులకు పెంచి జీరామ్‌జీ పథకంగా తెచ్చిందని తెలిపారు. ఇది కూలీలకు ఉపాధి తోపాటు గ్రామాభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. ఈ పథకం పక్కాగా అమలైతే గ్రామీణ స్థాయివరకు బీజేపీ మరింత బలోపేతం అవుతుందనే కాంగ్రెస్‌పార్టీ దుష్ప్రచారం మొదలు పెట్టిందన్నారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆలూరు కార్యక్రమానికి వస్తున్న ఎంపీ చేవెళ్ల బస్‌స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. గతంలో ఆలూరు గేట్ వద్ద ఎక్స్‌ప్రెస్ బస్సులు ఆగేలా చూడాలని గ్రామస్తులు కోరడంతో ఆయన ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఒప్పించారు. ఈ క్రమంలో స్వయంగా పరిశీలించేందుకు బస్సులో వచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు అనంత్‌రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీకాంత్, యువ నాయకుడు డాక్టర్ మల్గారి వైభవ్‌రెడ్డి, జిల్లా నాయకులు వెంకట్‌రెడ్డి, ఆంజనేయులు, శర్వలింగం, ఇంద్రసేనారెడ్డి, సత్యనారాయణ, జయశంకర్ పాల్గొన్నారు.
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి


