తల్లిని చంపిన తనయుడికి జీవిత ఖైదు
ఇబ్రహీంపట్నం రూరల్: తాగుడుకు బానిసై తల్లిని హత్యచేసిన కొడుకుకు కోర్టు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఆదిబట్ల సీఐ రవికుమార్ తెలిపిన ప్రకారం.. ఠాణా పరిధిలోని కొంగరకలాన్‌కు చెందిన కోహెడ పెంటయ్య(29) మద్యానికి బానిసయ్యాడు. 2024 ఫిబ్రవరి 9న తాగుడుకు డబ్బు ఇవ్వాలంటూ తల్లి లలిత(55)తో గొడవపడ్డాడు. ఆమె నిరాకరించడంతో తల్లి ఛాతిపై కూర్చుని మెడకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి అంతమొందించాడు. మృతురాలి బావ కొడుకు నర్సింహ ఫిర్యాదు మేరకు పోలీసులు పెంటయ్యను రిమాండ్‌కు తరలించారు. కోర్టులో సాక్షాధారాలను ప్రవేశపెట్టిన పిదప అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు శోభరాణి, వేణుగోపాల్‌రెడ్డిలు ప్రాసిక్యూషన్ తరుపున వాదించగా 15వ అడిషనల్ డిస్ట్రిక్ సెషన్ జడ్జి రంగారెడ్డి వాదోపవాదనలు వినిపించిన తరువాత కోహెడ పెంటయ్యకు జీవిత ఖైదుతో పాటు రూ.వేయి జరిమాన విధిస్తూతీర్పు వెల్లడించారు. కేసుకు సహకరించిన అప్పటి సీఐ రాఘవేందర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస రాజులతో పాటు పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు .
నాగారం హత్య కేసులో..
మహేశ్వరం: మండల పరిధిలోని నాగారంలో జరిగిన హత్య కేసులో గ్రామానికి చెందిన కావలి మచ్చేందర్‌కు శుక్రవారం ఎల్‌బీనగర్ 3వ అదనపు జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. 2018లో నాగారం గ్రామానికి చెందిన కావలి కావలి శంకరయ్య కుమారుడు కావలి కృష్ణ అనుమానాస్పదంగా మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన తొట్ల రాజు హత్య చేశాడని మృతుడి సోదరుడు కావలి మచ్చేందర్, తండ్రి శంకరయ్య పగ పెంచుకున్నారు. గ్రామ చౌరస్తాలోని తొట్ల రాజు హోటల్ వద్ద నిలుచుండగా మచ్చేందర్, శంకరయ్య గొడ్డలితో నరికి హత్య చేసి పరారయ్యారు. మృతుడి తండ్రి తొట్ల నర్సింహ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసి నిందితులను రిమాండ్‌కు తరలించారు. పోలీసులు నిందితులపై ఛార్జిషీటు దాఖలు చేయడంతో ఇరువురు వాదనలు పూర్తయిన తరువాత ఎల్‌బీనగర్ 3వ అదనపు జిల్లా కోర్టు ప్రధాన నిందితుడైన కావలి మచ్చేందర్‌కు జీవిత ఖైదు విధిస్తూ, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
ఆర్టీసీ బస్సునుఢీకొట్టిన లారీ
బస్సు డ్రైవర్, కండక్టర్‌తో
పాటు బాలుడికి గాయాలు
తాండూరు టౌన్: అతివేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్‌తో పాటు ఓ బాలుడు గాయపడ్డారు. ఈ ఘటన తాండూరు పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చేటుచేసుకుంది. సీఐ సంతోశ్‌కుమార్ తెలిపిన ప్రకారం.. తాండూరు డిపోకు చెందిన బస్సు మెట్లకుంటకు వెళ్లేందుకు బస్టాండ్‌నుంచి బయటకు వస్తోంది. ఈ క్రమంలో కొడంగల్ రోడ్డు నుంచి ఇందిరాచౌక్‌వైపు ప్రయాణిస్తున్న లారీ వేగంగా బస్సును ఢీకొట్టి కొంతదూరం లాక్కెళ్లింది. ఈ ఘటనలో బస్సు, లారీ అద్దాలు ధ్వంసమయ్యాయి. గాయపడిన డ్రైవర్ నారాయ ణ, కండక్టర్ యాదమ్మ, బాలుడికి గాయాలవడంతో స్థానికులు వారిని తాండూరు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బ స్సులో 11మంది ప్రయాణికులున్నారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సబ్సిడీ వ్యవసాయ పరికరాలతో రైతులకు మేలు
నవాబుపేట: సబ్సిడీ వ్యవసాయ పరికరాలతో రైతులకు మేలు చేకూరుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం రైతులకు వ్యవసాయ పరికరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతులు, పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తోందన్నారు. వ్యవసాయ పరికరాలను తీసుకున్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం 36 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గీతాసింగ్‌నాయక్, తహసీల్దార్ బుచ్చయ్య, ఎంపీడీఓ అనురాధ, వ్యవసాయ శాఖ ఏడీ వెంకటేశం, తదితరులు పాల్గొన్నారు.


