వీధికుక్కల కేసు విచారణ వేగిరం
యాచారం: వీధి కుక్కలకు విషపూరిత ఇంజక్షన్లు ఇచ్చి చంపేసిన బాధ్యులపై కఠిన చర్యలకు స్టే ఎనిమల్స్ ఫౌండేషన్ ప్రతినిధులు జాతీయ స్థాయిలో ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో పీపుల్స్ ఫర్ ఎనిమల్స్ వ్యవస్థపకురాలు, మాజీ కేంద్ర మంత్రి మేనకాగాంధీ తీవ్ర ఒత్తిళ్ల వల్లే యాచారం పోలీసులు కళేబరాలను గుర్తించారు. అంతే వేగంగా విచారణ చేపట్టి పశువైద్యాధికారుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు అధికారులు సైతం విచారణ వేగవంతం చేశారు. గ్రామస్తుల పెంపుడు కుక్కలకు సైతం విషపూరిత ఇంజక్షన్లు ఇచ్చి చంపేయడంతో బాధితులు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు ఫోన్లలో ఫిర్యాదు చేసారు. వారు మూడు రోజుల పాటు మనోవేదనతో, అన్నపానీయాలు సైతం తీసుకోలేదని తెలుస్తోంది. గ్రామస్తులు సమాచారంతో, స్వచ్ఛంద సంస్థల ఫిర్యాదు మేరకు యాచారం పోలీసులు పంచాయతీ సిబ్బంది సహకారంతో పూర్తి సమాచారం రాబట్టినట్లు సమాచారం.
ఫోరెన్సిక్ నివేదిక వస్తేనే..
ఖననం చేసిన వీధి కుక్కల కళేబరాలను గురువారం వెలికి తీశారు. పశువైద్యాధికారుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించారు. యాచారం పశువైద్యాధికారి డాక్టర్ రేఖ ఆధ్వర్యంలో ఒక్కో కుక్క నుంచి నాలుగు నుంచి ఐదు సాంపిల్స్ సేకరించి పోలీసులకు అప్పగించారు. వారు రెడ్‌హిల్స్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. నివేదిక వచ్చిన తర్వాతే కేసును వేగవంతంగా విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. వీధి కుక్కలను చంపేయడం రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారగా, యాచారం పంచాయతీ పాలకవర్గం, సిబ్బందికి మాత్రం కంటికి కునుకు లేకుండా చేసింది.
బాధ్యులపై చర్యలకు జాతీయ స్థాయిలో ఒత్తిడి తెస్తున్న స్టే ఎనిమల్స్ ఫౌండేషన్ ప్రతినిధులు


