చెట్టును ఢీకొట్టిన ఆటో
ఒకరి మృతి, పలువురికి గాయాలు
శంకర్‌పల్లి: అతివేగంగా వెళ్తున్న ఆటో అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ సురేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం దేవరంపల్లి, చక్రంపల్లి గ్రామాలకు చెందిన 8 మంది గచ్చిబౌలిలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. సాయంత్రం గచ్చిబౌలిలో విధులు ముగించుకున్న ఆటో మోమిన్‌పేట్‌కు బయలు దేరారు. శంకర్‌పల్లిలో పర్వేద గ్రామానికి చెందిన చంద్రయ్య(50) ఆటోలో ఎక్కాడు. మహాలింగాపురం వద్ద ఆటో చెట్టును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రయ్య అక్కడికక్కడే మృతి చెందగా, దేవరంపల్లికి చెందిన అశోక్ కాలు విరిగింది. మిగిలిన వారికి పాక్షిక గాయాలు కాగా.. వారిని శంకర్‌పల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆటో డ్రైవర్ దివాకర్ పరారీలో ఉన్నాడని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రెండు రోజుల్లో సర్వే పూర్తి
మంఖాల రేంజ్ ఫారెస్టు అధికారి ప్రభాకర్
ఇబ్రహీంపట్నం రూరల్: అడవుల్లో జంతువుల సౌకర్యాలు, పెరుగుతున్న అటవీ సందపను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని మంఖాల రేంజ్ ఫారెస్టు అధికారి ప్రభాకర్ అన్నారు. ఆల్ ఇండియా పులుల గణన కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 20 నుంచి అడవుల్లోని శాఖాహార, మాంసాహార జంతువుల సర్వే చేపట్టారు. మండల పరిధిలోని ఎల్మినేడు బీట్‌లో సెక్షన్ అధికారి లావణ్య ఆధ్వర్యంలో ఈ గణన కొనసాగుతోంది. మూడో రోజు మంఖాల రేంజ్ ఫారెస్టు అధికారి ప్రభాకర్ మాట్లాడుతూ.. మన ప్రాంతంలో పులులు లేవన్నారు. మాంసాహార జంతువుల పాద ముద్రలు, మలం ఆధారంగా గుర్తిస్తున్నామని చెప్పారు. నక్క, అడవి పిల్లులు ఎక్కువగా సంచరిస్తున్నాయని వివరించారు. మరో రెండు రోజుల్లో సర్వే పూర్తి అవుతుందన్నారు.


